13 ఏళ్ళ తర్వాత మళ్లీ దర్శకత్వం !
దాదాపు 13 ఏళ్ల తర్వాత, భరణి మళ్లీ దర్శకుడిగా ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆయన.. ఈ కొత్త చిత్రంలో 20 మధ్య వయస్సు గల యువత నటించబోతున్నారని వెల్లడించారు.;
నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించిన తనికెళ్ల భరణి.. దర్శకుడిగానూ తన ప్రతిభను ‘సిరా’ అనే లఘుచిత్రం ద్వారా నిరూపించుకున్నారు. కానీ ఆయన దర్శకత్వ ప్రతిభను మరింత బలంగా చాటిన చిత్రం ‘మిథునం’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం, కేవలం ఇద్దరు పాత్రల మధ్య నడిచే భావోద్వేగ కథనంతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. పెళ్లి తర్వాత దాంపత్య జీవితం ఎంత అనురాగభరితంగా సాగుతుంది అనే అంశాన్ని ‘మిథునం’ అద్భుతంగా ఆవిష్కరించింది.
ఈ సినిమా ఉత్తమ మాటల రచయితగా తనికెళ్ల భరణికి నంది అవార్డును అందించడంతో పాటు, మొత్తం నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. కథ, కథన శైలి, నటన, సంగీతం.. ఇలా ప్రతి అంశంలోనూ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించి ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఇంక ఇప్పుడు.. దాదాపు 13 ఏళ్ల తర్వాత, భరణి మళ్లీ దర్శకుడిగా ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆయన.. ఈ కొత్త చిత్రంలో 20 మధ్య వయస్సు గల యువత నటించబోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం కథానాయకుడు, కథానాయిక సహా ఇతర ముఖ్యపాత్రలను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
సామాజిక విషయాలను హృద్యంగా, భావోద్వేగపూరితంగా చెప్పగల నైపుణ్యం తనికెళ్ల భరణికి ఉన్నందున... ఆయన తాజా సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి సినీ ప్రియులలో నెలకొంది. ‘మిథునం’ తర్వాత ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో క్లాసిక్‌గా నిలుస్తుందా? అనేది వేచి చూడాలి.