సమంతకు గుడి కట్టిన ఒక అభిమాని
సమంత నటనకు, దాతృత్వానికి ఎంతగానో ముచ్చటపడి.. టి.ఎం. సందీప్ అనే అభిమాని తన ఇంట్లో సమంతకు ప్రత్యేక గుడిని నిర్మించాడు.;
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు పుట్టినరోజు సందర్భంగా బాపట్ల జిల్లాలోని ఆలపాడు గ్రామంలో ఓ విశేషమైన ఘటన చోటుచేసుకుంది. ఆమె నటనకు, దాతృత్వానికి ఎంతగానో ముచ్చటపడి.. టి.ఎం. సందీప్ అనే అభిమాని తన ఇంట్లో సమంతకు ప్రత్యేక గుడిని నిర్మించాడు. ఈ అరుదైన చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2023లో సమంత పుట్టినరోజున గుడి నిర్మాణాన్ని ప్రారంభించిన సందీప్, ఈ ఏడాది గుడిలో సమంత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
"సినిమాల్లో సమంత నటన, సేవా కార్యక్రమాల్లో ఆమె చూపిన మానవత్వం నన్నెంతో ప్రభావితం చేశాయి. ప్రత్యేకించి కరోనా సమయంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు నాకు ప్రేరణగా నిలిచాయి," అంటూ సందీప్ తన అభిమానం వ్యక్తపరిచాడు. ప్రస్తుతం సమంత తన తొలి నిర్మాణ ప్రయత్నమైన 'శుభం' సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రం 2025 మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళనాడులో ఖుష్బూ, నమిత వంటి నటి మణులకు అభిమానులు గుడులు నిర్మించిన సందర్భాలు ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. అయితే సమంత గుడి నిర్మాణం విషయమై ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.