ఆ రెండు సినిమాలపై మంచి హోప్స్ ఉన్నాయి !

ఆయన అభిమానులు మాత్రం రాబోయే సినిమాలు సూపర్ హిట్టయి ఆయన మళ్లీ ట్రాక్ ఎక్కుతాడని ధీమాగా ఉన్నారు.;

By :  K R K
Update: 2025-09-23 09:29 GMT

మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకూ చాలా ప్లాపుల్నే చవి చూశాడు. అయినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం రాబోయే సినిమాలు సూపర్ హిట్టయి ఆయన మళ్లీ ట్రాక్ ఎక్కుతాడని ధీమాగా ఉన్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్’ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో గత రెండు సంవత్సరాలుగా ఆయన కెరీర్ కొంత నిరాశగా సాగింది. కానీ ఆయన తర్వాతి చిత్రాలపై ఇప్పటికే చాలా అంచనాలు పెరిగాయి. భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి.

అలాగే... రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు . ఈ ప్రాజెక్టును సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, ఈ చిత్రం స్టైల్, డ్రామా, ఎంటర్ టైన్ మెంట్ కలయికగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో ఒక కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక తర్వాతి దశ అక్టోబర్ మొదటి వారం నుండి స్పెయిన్‌లో ప్రారంభమవుతుంది. ఈ విదేశీ షెడ్యూల్ ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఇందులో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తారు.

ఈ చిత్రంలో రవితేజను స్టైలిష్‌గా, పూర్తి వినోదాత్మక పాత్రలో చూడవచ్చని, ఆయనను "మాస్ మహారాజా" అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. స్పెయిన్‌లోని అందమైన ప్రదేశాలు, అద్భుతమైన సంగీతం, డైనమిక్ కెమెరా వర్క్ కథకు మరింత పదును పెడతాయని.. ప్రేక్షకులను సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి రవితేజ కెరీర్ ను మాస్ జాతర, కిశోర్ తిరుమల చిత్రాలు మలుపు తిప్పబోతున్నాయన్నమాట. 

Tags:    

Similar News