‘సలార్ 2’ గురించి ఎలాంటి డౌట్స్ వద్దు : ప‌ృధ్విరాజ్ సుకుమారన్

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత మేమంతా కలిసి ‘సలార్ 2’ మూవీ కోసం పని చేస్తాం" అని వెల్లడించాడు.;

By :  K R K
Update: 2025-01-30 00:51 GMT

మలయాళ స్టార్ హీరో .. ప‌ృధ్విరాజ్ సుకుమారన్ ఇటీవల తన తాజా చిత్రం ‘ఎల్ 2 : ఎంపురాన్’ టీజర్‌ను విడుదల చేసి చర్చనీయాంశంగా మారాడు. ఈ సందర్భంలో ఆయన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ మూవీ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. పృధ్విరాజ్ మాట్లాడుతూ.. "సలార్ 2 సినిమా ఖచ్చితంగా తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత మేమంతా కలిసి ‘సలార్ 2’ మూవీ కోసం పని చేస్తాం" అని వెల్లడించాడు.

‘సలార్: పార్ట్ 2.. శౌర్యాంగ పర్వం’ 2023లో విడుదలైన ‘సలార్: పార్ట్ 1 సీస్‌ఫైర్’ కు కొనసాగింపు. ప్రభాస్, ప‌ృధ్విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మొదటి భాగం దేవా-వరదా మధ్య స్నేహాన్ని ఎలివేట్ చేయగా, ఖన్సార్ అనే ఊహాత్మక నగరం నేపథ్యంలో ఈ కథ నడిచింది.

వరద తన తండ్రి మంత్రులు, బంధువుల కుట్రలతో సతమతమవుతాడు. తన స్నేహితుడు దేవా సహాయంతో అన్ని అవరోధాలను అధిగమించి ఖన్సార్ అధిపతి కావాలని ప్రయత్నిస్తాడు. మొదటి భాగం ఆసక్తికరమైన క్లైమాక్స్‌తో ముగియడంతో.. రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఇప్పటికే ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ 2026లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ... ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా తెలియరాలేదు.

ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఇది బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర ఆధారంగా నడిచే పీరియడ్ యాక్షన్ సినిమా అని సమాచారం. మరొకవైపు.. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే.. ‘స్పిరిట్, కల్కి 2898 AD పార్ట్ 2’ వంటి బడ్జెట్ చిత్రాలు కూడా ప్రభాస్ లైన్ అప్‌లో ఉన్నాయి.

Tags:    

Similar News