ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి
గ్రామీణ థ్రిల్లర్ గా రూపొందిన ‘వికటకవి’ వెబ్ సిరీస్.. శక్తివంతమైన కథనంతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.;
ఈ నెల 22వ తేదీన ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. ఇందులో ప్రముఖ తెలుగు దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ‘వికటకవి’ వెబ్ సిరీస్ కోసం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదీప్ నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ అట్ నైట్) తో కలిసి పంచుకున్నారు.
గ్రామీణ థ్రిల్లర్ గా రూపొందిన ‘వికటకవి’ వెబ్ సిరీస్.. శక్తివంతమైన కథనంతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సిరీస్, గోవాలోని IFFI ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ గా గుర్తింపు పొందింది.
అవార్డు అందుకున్న సందర్భంగా ప్రదీప్ మద్దాలి తన తల్లిదండ్రులకు, చిత్రబృందానికి, హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ‘వికటకవి’ రెండో సీజన్ పై అంచనాలు పెరిగాయని తెలిపారు. రీజినల్ ఓటీటీ కంటెంట్ కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ అవార్డు సూచిస్తుందని CEO అవినాష్ ముదలియార్ పేర్కొన్నారు.