సందీప్ రెడ్డికి హామీ ఇచ్చిన ప్రభాస్ !
2025 ద్వితీయార్థంలో "స్పిరిట్" షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పిన ప్రభాస్, ఇంకా రెండు నెలలు ఆగమని దర్శకుడిని కోరాడట.;
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ అనేక సినిమాలతో బిజీగా ఉండి... కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే అతడు అనేక ప్రాజెక్టులు సైన్ చేసి.. ఏకకాలంలో రెండు చిత్రాల పనిని పూర్తి చేసి ఈ ఏడాదిలో ఎక్కువ సినిమాలు పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్స్ కొన్ని అడ్డంకులతో నిలిచిపోయాయి. ప్రస్తుతం “ద రాజా సాబ్” సినిమా విడుదల సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిత్ర నిర్మాణం వేగంగా ముందుకు సాగడం లేదు. మరోవైపు “ఫౌజీ” సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండటంతో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే “స్పిరిట్” అనే చిత్రం షూటింగ్ ప్రారంభం కాలేకపోతోంది.
“స్పిరిట్” చిత్రం ఈ ఏడాది జనవరిలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పటివరకు అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా, ప్రభాస్‌కు మళ్లీ మళ్లీ మోకాలు సంబంధిత సమస్యలు రావడంతో.. వైద్యులు ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని సూచించినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ అన్ని ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేయాలన్న ఉద్దేశ్యాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్” ప్రాజెక్టు విషయంలో కొంత ఆందోళనకు లోనవుతున్నాడు. ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్లలో ఒకరైన సంధీప్, ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన "యానిమల్" సీక్వెల్ “యానిమల్ పార్క్” సినిమా కోసం కమిట్ అయ్యాడు. ఆ సినిమా 2026లో ప్రారంభం కావాల్సి ఉంది. లేకపోతే హీరో రణబీర్ కపూర్ ఇతర సినిమాలతో బిజీ అయిపోతాడు.
ఈ నేపథ్యంలో, ప్రభాస్ పరిస్థితిని అర్థం చేసుకున్న సందీప్‌కు.. తన సినిమా కోసం ప్రాధాన్యత ఇస్తానని ప్రభాస్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2025 ద్వితీయార్థంలో "స్పిరిట్" షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పిన ప్రభాస్, ఇంకా రెండు నెలలు ఆగమని దర్శకుడిని కోరాడట. అంతేకాదు, షూటింగ్ కోసం లొకేషన్లు చూసేందుకు సందీప్ రెడ్డి వంగా ఇటీవల మెక్సికో వెళ్లినట్టు సమాచారం. టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న “స్పిరిట్” చిత్రం, డ్రగ్ కార్టెల్స్, గ్లోబల్ క్రైమ్ సిండికేట్స్ నేపథ్యంలో నడిచే ఒక పవర్‌ఫుల్ కాప్ డ్రామా. ఇందులో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.