జూన్ లో పాన్ ఇండియా సినిమాల జాతర !
రాబోయే జూన్ మాత్రం భారీ అంచనాల మీద ఉన్న పాన్-ఇండియా సినిమాల రాకతో సందడిగా మారబోతోంది. ఇప్పటికే వీటి విడుదల తేదీలు ఖరారయ్యాయి. జూన్‌లో విడుదలకు కొన్ని ముఖ్యమైన సినిమాలు రెడీగా ఉన్నాయి.;
జూన్ నెల సాధారణంగా సినిమా విడుదలలకు కొంచెం డల్ సీజన్. అయితే విచిత్రంగా ఈసారి సమ్మర్ టాలీవుడ్‌కు చాలా డ్రై సీజన్‌గా మారింది. కొన్ని అభినందనీయమైన సినిమాలు తప్పితే పెద్దగా ఆకర్షణీయమైన చిత్రాలు లేవనే చెప్పాలి. కానీ ఇప్పుడు రాబోయే జూన్ మాత్రం భారీ అంచనాల మీద ఉన్న పాన్-ఇండియా సినిమాల రాకతో సందడిగా మారబోతోంది. ఇప్పటికే వీటి విడుదల తేదీలు ఖరారయ్యాయి. జూన్‌లో విడుదలకు కొన్ని ముఖ్యమైన సినిమాలు రెడీగా ఉన్నాయి.
థగ్ లైఫ్
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ చేస్తున్న ఈ చిత్రం, వారి మధ్య దశాబ్దాల తర్వాత జరిగిన గొప్ప కలయిక కావడం విశేషం. సింబు, త్రిషా కృష్ణన్, సాన్యా మల్హోత్రా, అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద భారీ అంచనాలున్నాయి.
హరిహర వీర మల్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎన్నో ఆలస్యాల తర్వాత చివరికి విడుదలకు సిద్ధమైంది. జూన్ 13న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం, అధికారిక ప్రకటన త్వరలో రానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో, ఏఎమ్ రత్నం నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా కూడా పాన్ ఇండియా విడుదలగా ప్లాన్ చేయబడింది.
కుబేర
తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో రూపొందుతున్న చిత్రం కుబేర. జూన్ 20న విడుదలకు సిద్ధమైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది కూడా పాన్-ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది.
సితారే జమీన్ పర్
ఆమిర్ ఖాన్ నిర్మాణంలో రూపొందిన ఆసక్తికరమైన చిత్రం సితారే జమీన్ పర్ కూడా జూన్ 20న విడుదల కాబోతోంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇవేగాక, జూన్‌లో మరో రెండు ముఖ్య సినిమాలు కూడా విడుదలకానున్నాయి. అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 5’, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కూడా జూన్ లోనే విడుదలలు ఖరారు చేసుకున్నాయి.
మొత్తానికి ఈ జూన్‌లో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే పోటీ కనిపించనుంది. పాన్-ఇండియా స్థాయి సినిమాలు, స్టార్ కాస్ట్, ఆసక్తికరమైన కథలతో సినీ ప్రేమికులకు ఈ జూన్ సీజన్ పెద్ద పండగే.