SSMB29పై ఆఫీషియల్ లీక్!
ఇండియా నుంచి గ్లోబల్ లెవెల్ లో అలరించడానికి రెడీ అవుతుంది SSMB29. మహేష్-రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా ఈ షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరిద ఈ చిత్ర షూటింగ్ గురించి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 'గతంలో ‘పుష్ప-2’ షూటింగ్ ఒడిశాలోని మల్కనగిరిలో జరిగితే, ఇప్పుడు SSMB29 చిత్రం కూడా ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఒడిశాలోని అందమైన సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్స్‌ను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశం. ప్రస్తుతానికి కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఇందులో పాల్గొంటున్నారు' అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచే స్ట్రాటజీ పాటిస్తుంటాడు. అయినా ఈ లీక్ ద్వారా SSMB29 షూటింగ్ అప్డేట్ అఫీషియల్ గా వచ్చేసినట్టు అయ్యింది. ఇక ఈ సినిమాపై రోజుకో కొత్త సమాచారం వెలువడుతుండటంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్, భారతీయ సినీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.