డబ్బింగ్ చిత్రాల హవా.. 'ఛావా, కింగ్‌స్టన్'పై ఆసక్తి!

Update: 2025-03-06 12:46 GMT

శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. రేపు కూడా పలు కొత్త సినిమాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. అయితే ఈ వారం వస్తోన్న సినిమాలలో డబ్బింగ్ చిత్రాలదే పైచేయిగా కనిపిస్తుంది.

బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘ఛావా’ తెలుగులో మూడు వారాల ఆలస్యంగా విడుదల కానుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకర్షించగలదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'కింగ్‌స్టన్' మూవీ రేపు తెలుగులోనూ సందడి చేయబోతుంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ‘కింగ్‌స్టన్‘ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. కమల్‌ ప్రకాశ్‌ తెరకెక్కించిన ఈ ‘సీ ఫాంటసీ అడ్వెంచర్‌’ లో దివ్య భారతి హీరోయిన్‌ నటించింది.

రేపు విడుదలవుతోన్న తెలుగు చిత్రాలలో 'నారి, రారాజా, పౌరుషం, వైఫ్ ఆఫ్ అనిర్వేష్, శివంగి, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో' వంటి సినిమాలున్నాయి. ‘నారి‘ విషయానికొస్తే సీనియర్ నటీమణి ఆమని ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించిన ఈ సినిమా మహిళా సాధికారత అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయనుందట.

అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమాగా ‘రారాజా‘ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రమిది.

రేపు విడుదలవుతోన్న చిత్రాలలో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన 'శివంగి' ఒకటి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 'శివంగి' సినిమా రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది.

అంకిత్ కొయ్య, శ్రియ కొంతం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా '14 డేస్ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో' కూడా రేపు ఆడియన్స్ ముందుకు వస్తోంది. గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన కుర్రాడు అనుకోకుండా అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది.

Tags:    

Similar News