డబ్బింగ్ స్టేజ్ లోకి ‘హరిహర వీరమల్లు’!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘హరిహర వీరమల్లు‘. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం ఈసారి అనుకున్న సమయానికి రావడం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి. మే 9న వరల్డ్ వైడ్ గా ‘హరిహర వీరమల్లు‘ విడుదలకు ముస్తాబవుతుంది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో తిరుగుబాటు చేసిన ఓ దొంగ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ముందుగా క్రిష్ కొంతభాగం తెరకెక్కించిన ఈ సినిమాని జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఎ.ఎమ్.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపిస్తుండగా.. ఔరంగజేబుగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కనిపించనున్నాడు. పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది.
ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా మరో అంకాన్ని మొదలు పెట్టుకుంది. తాజాగా ఈ సినిమాకి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. మొత్తంగా మంత్రిగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ‘హరిహర వీరమల్లు‘ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.