బాబీ డియోల్ పాత్రను రీడిజైన్ చేశారు !
"యానిమల్" లో బాబీ డియోల్ అద్భుతమైన నటన చూసి, ఔరంగజేబ్ పాత్రను పూర్తిగా మార్చాలని నిర్ణయించాడు దర్శకుడు జ్యోతికృష్ణ.;
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ "హరి హర వీర మల్లు" సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదట అతని సౌత్ ఇండియన్ డెబ్యూ కావాల్సి ఉండగా.. ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా అతని రెండు ఇతర సౌత్ ఇండియన్ సినిమాలు.. "కంగువ, డాకు మహారాజ్".. దీనికంటే ముందు విడుదలయ్యాయి. "హరి హర వీర మల్లు" చిత్రానికి సైన్ చేసినప్పుడు అప్పటికి ఇంకా బాబీ డియోల్ సందీప్ రెడ్డి వంగా "యానిమల్" సినిమాకు సైన్ చేయలేదు.
దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. "యానిమల్" లో బాబీ డియోల్ అద్భుతమైన నటన చూసి, ఔరంగజేబ్ పాత్రను పూర్తిగా మార్చాలని నిర్ణయించాడు. బాబీ ఆరోగెంట్ లుక్, తక్కువ డైలాగ్‌లతో శక్తివంతమైన భావోద్వేగాలను వ్యక్తీకరించే సామర్థ్యం దర్శకుడిని ఆకట్టుకుంది. "యానిమల్‌లో బాబీ డియోల్ నటన మంత్రముగ్ధులను చేసింది," అని జ్యోతి కృష్ణ చెప్పాడు. "తక్కువ మాటలతో భావోద్వేగాలను వ్యక్తం చేసిన విధానం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అది నాకు ఈ సినిమాలో అతని పాత్రను పునర్మించేలా ప్రేరేపించింది. అందుకే ఈ పాత్రకు పూర్తి మేకోవర్ ఇచ్చి, మరింత బలమైన కథాంశం జోడించాను..." అని డైరెక్టర్ చెప్పాడు.
బాబీ డియోల్ స్క్రీన్ పర్సోనా మరియు కొత్తగా వచ్చిన స్టార్డమ్‌కు సరిపోయేలా, జ్యోతి కృష్ణ ఔరంగజేబ్ పాత్ర లో ముఖ్యమైన మార్పులు చేశాడు. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న "హరి హర వీర మల్లు" సినిమా 2025 జులై 24న విడుదల కానుంది.