ఔరంగజేబ్ దాష్టీకానికి ధర్మం గట్టి సమాధానం!
కోహినూర్ ఎలా పోయిందో కాదు... ఎవరు పోరాడారో తెలుసుకోవాలి!;
హరిహర వీరమల్లు సినిమా పూర్తి కల్పిత కథ ఆధారంగా రూపొందించబడినప్పటికీ, ఇది సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక యోధుడు చేసే పోరాటాన్ని హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించబడింది. హిందువులుగా జీవించాలంటే పన్నులు కట్టాల్సిన పరిస్థితిని, మొగలుల కఠిన పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణలను కథలో ప్రధానంగా ప్రస్తావించారు. చిత్రంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను అత్యంత క్రూరంగా చూపిస్తూ, అతడి దాష్టీకానికి వ్యతిరేకంగా ధర్మాన్ని కాపాడే పోరాట యోధుడిగా హరిహర వీరమల్లును తీర్చిదిద్దారు. ఈ కథ కేవలం ఓ యోధుడి కథ మాత్రమే కాకుండా, ఒక విలువైన భావనకు, ధర్మానికి నిలబడ్డ కథగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
ఈ చిత్ర కథలో చారిత్రక అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కోహినూర్ వజ్రం మొగలుల వద్దకు ఎలా చేరిందనే అంశాన్ని కథలో అంతర్లీనంగా చూపించారు. కృష్ణా నదీ తీరంలో దొరికిన వజ్రాన్ని కులీ కుతుబ్ షా నుంచి మొగలులు ఎలా స్వాధీనం చేసుకున్నారనే చరిత్రకు ఊహాత్మకంగా ఆధారం తీసుకొని రూపొందించిన ఈ కథ, చారిత్రక దృక్కోణంలో కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
హరిహర వీరమల్లు సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ప్రకృతి విపత్తులు, రాజకీయ అడ్డంకులు, సినిమాలపై విధించిన ఆంక్షలు ఈ చిత్ర బృందానికి పెద్ద సవాళ్లుగా మారాయి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయడం వెనుక ఉన్న కారణం – నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాలకు అండగా నిలవాలనే భావన. సినిమా నిర్మాణంలో ధైర్యంగా నిలిచిన వారికి మద్దతుగా ఉండటం తన బాధ్యతగా భావించారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తన గత చిత్రం "జానీ" ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ, అది తన జీవితానికి ఒక గొప్ప పాఠంగా మారిందని చెప్పారు. అప్పట్లో సినిమా ఫెయిలవడంతో బయ్యర్లను, ఫైనాన్షియర్లను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలు పరిష్కరించాను అని గుర్తు చేసారు. ఆ అనుభవమే రాజకీయాల్లో ఎదురైన సంక్షోభాలను తట్టుకునే శక్తిని ఇచ్చిందని అన్నారు. జానీ చిత్రం తనలో ఓ మార్పును తీసుకువచ్చిందని, అదే తనకు ధైర్యంగా ముందుకు సాగే మార్గాన్ని చూపిందని తెలిపారు పవర్ స్టార్.
ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో మలుపులు, మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా సినిమా తుది దశకు చేరుకొని విడుదలకు సిద్ధమవుతుంది. హరిహర వీరమల్లు చిత్రానికి రెండో భాగం కూడా ఉంది. ఇప్పటికే పార్ట్ – 2కి 20 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. థియేటర్ల కొరత లేదని స్పష్టం చేశారు. అలాగే, సహచర ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేయాలన్న ఆలోచనను స్వీకరించి, త్వరలోనే అమలు చేస్తానని చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో అభివృద్ధి చెందిన విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన వసతులు, ఫిల్మ్ స్కూల్స్, టెక్నికల్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త టాలెంట్‌కు అవకాశం లభించాలంటే ఈ విధంగా పరిశ్రమ పునాదుల నుంచి పెరిగేలా చేయాలన్నారు డిప్యూటీ సీఎం.