దర్శకధీరుడు రాజమౌళి పై వివాదాస్పద ఆరోపణలు!
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై ఆయన స్నేహితుడు యు. శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉన్న శ్రీనివాసరావు, తాజాగా ఒక సెల్ఫీ వీడియో మరియు లేఖ ద్వారా తన మనోవేదనను వ్యక్తపరిచారు. ఈ వీడియోలో, రాజమౌళి టార్చర్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
శ్రీనివాసరావు పేర్కొన్న ప్రకారం, ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించామని, ఆ సందర్భంలో రాజమౌళి తనను అమ్మాయిని త్యాగం చేయమని అడిగారని తెలిపారు. తొలుత అంగీకరించకపోయినప్పటికీ, చివరికి తానే త్యాగం చేసినట్లు వెల్లడించారు. ఆ సంఘటన ‘శాంతినివాసం‘ సీరియల్‌కు ముందు జరిగిందని ఆయన చెప్పారు.
శ్రీనివాసరావు, 'యమదొంగ' సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియో, లేఖను రాజమౌళి సన్నిహితులకు పంపించినట్టు తెలుస్తోంది. ఈ ఆధారాలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని, రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆరోపణలు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. రాజమౌళి, శ్రీనివాసరావు మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం నేపథ్యంలో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకూ రాజమౌళి ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు