మాటల్లేకుండా మాయచేయబోతున్న ‘భాగమతి’ డైరెక్టర్

By :  T70mm Team
Update: 2025-02-26 07:03 GMT

భారతీయ చిత్రసీమలో మూకీ సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి. కమల్‌హాసన్ ‘పుష్పక విమానం’ తరువాత.. తెలుగు. తమిళ దర్శకులు ఈ తరహా ప్రయోగాల జోలికి వెళ్లలేదు. అయితే, తాజాగా తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ మూకీ మూవీ చేశాడు. ఇప్పుడు.. టాలీవుడ్ దర్శకుడు జి అశోక్ బాలీవుడ్‌లో ఓ సైలెంట్ హారర్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నాడు. తెలుగు కాకుండా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉఫ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నోరా ఫతేహి, సోహామ్ షా, నుష్రత్ బరుచా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డైలాగ్స్ లేకుండా పూర్తిగా మూకీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం, సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ పరంగా కొత్తదనం తీసుకురాబోతుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేయబడింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడిందని ప్రచారం జరిగింది. అయితే, షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని సమాచారం. థియేటర్ల లో కాకుండా.. ‘ఉఫ్’ నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో నోరా ఫతేహి పాత్ర కీలకమైనదిగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో ‘కిక్ 2’, ‘లోఫర్’, ‘ఊపిరి’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన నోరా.. వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీలో నటించింది.

జి అశోక్ దర్శకత్వంలో వచ్చిన ‘పిల్ల జమీందార్’ నానికి మంచి హిట్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘చిత్రాంగద’ చిత్రాలు కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. కానీ, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భాగమతి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘దుర్గామతి’ పేరుతో రీమేక్ చేశారు, ఇందులో భూమి పడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోన్న జి అశోక్, ‘ఉఫ్’తో మరో వినూత్న ప్రయోగం చేయబోతున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Tags:    

Similar News