చిత్తూరు నేపథ్యంలో అఖిల్ మూవీ!
చిత్తూరు నేపథ్యంలో అఖిల్ మూవీ!తెలుగు సినిమాల్లో రాయలసీమ నేపథ్యమంటే ప్రధానంగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల మీదే దృష్టి ఉండేది. కానీ, తాజాగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌కు క్రేజ్ పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణం అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో చిత్తూరు యాస, సంస్కృతి, భాషను ఫోకస్ చేసే సినిమాల సంఖ్య పెరిగింది.
‘వినరో భాగ్యము విష్ణు కథ, హరోం హర, 35’ వంటి చిత్రాలు చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కాయి. ఇప్పుడు అక్కినేని అఖిల్ తన కొత్త సినిమాను ఇదే బ్యాక్‌డ్రాప్‌లో చేయబోతున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
‘ఏజెంట్’ విఫలమైన తర్వాత అఖిల్ కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాను ఫైనల్ చేశాడు. అనుకున్న ప్రాజెక్టులు వాయిదా పడడంతో ఈ సినిమా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ నెల 14న షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్తూరు యాస, సంస్కృతి ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ఇప్పటికే చిత్తూరు మాండలికంపై మంచి పట్టు సాధించాడట అఖిల్.