‘తండేల్‘ కథతో సత్యదేవ్
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చందు మొండేటి తెరకెక్కించిన ‘తండేల్‘ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.;
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చందు మొండేటి తెరకెక్కించిన ‘తండేల్‘ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇంచుమించు ఇదే కథతో సత్యదేవ్ నటించిన ‘అరేబియా కడలి’ సిరీస్ వస్తోంది.
సత్యదేవ్, ఆనంది జంటగా నాజర్, రఘు బాబు, పూనమ్ బజ్వా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ను వి.వి. సూర్యకుమార్ తెరకెక్కించగా, స్టోరీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ప్రముఖ దర్శకుడు క్రిష్ వ్యవహరించడం విశేషం. ఆగస్టు 8 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్ గా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సిరీస్ కథాంశం మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగుతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి పాకిస్థాన్ కోస్టుగార్డుల చేతికి చిక్కిపోవడం, వారి బంధీ జీవితం, స్వదేశానికి తిరిగివచ్చే ప్రయత్నాల్లో ఎదురైన పోరాటం, భావోద్వేగాలు ఈ సిరీస్‌లో ఆవిష్కరించినట్టు తెలుస్తోంది.
అయితే.. ఈ కథాంశాన్ని ‘తండేల్‘ సినిమాతో పోలుస్తూ వ్యాఖ్యలు వస్తున్నా, మేకర్స్ మాత్రం ఈ కథ పూర్తిగా కొత్తదని, అసలైన మత్స్యకారుల ఆధారంగా తీర్చిదిద్దినదని స్పష్టం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.