ప్రణవ్ మోహన్‌లాల్ కొత్త చిత్రం షూటింగ్ పూర్తి
మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రం షూటింగ్‌ను అధికారికంగా పూర్తి చేసుకుంది. భ్రమయుగం, భూతకాలం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన దర్శకుడు రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మళయాళ సినీ లోకంలో ఆసక్తికరమైన కలయికగా నిలిచింది.
ప్రణవ్ తన వైవిధ్యమైన నటనతో పేరు సంపాదించగా, రాహుల్ సదాశివన్ సైకాలాజికల్ హారర్ థ్రిల్లర్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మార్చి 24, 2025న కోచ్చిలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు యూనిట్ ఒక ఆసక్తికరమైన చిత్రం ద్వారా వెల్లడించింది. ఇందులో అడవిలో అగ్నికి ఎదురుగా నిలిచిన ప్రణవ్ సిల్హౌట్ రూపంలో కనిపిస్తూ, సినిమా బహుశా ఒక తీవ్రమైన, భావోద్వేగ, హారర్ శైలిలో ఉండవచ్చన్న ఊహాగానాలకు బలం చేకూర్చింది.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం రెండూ రాహుల్ సదాశివన్ అందించగా, టెక్నికల్ క్రూలో కెమెరామెన్ షెహ్నాద్ జలాల్, ఆర్ట్ డైరెక్టర్ జ్యోతిష్ శంకర్ ఉన్నారు. వైనాట్ స్టూడియోస్, షిఫ్ట్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. కథా విషయాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, రాహుల్ శైలిని బట్టి చూస్తే ఇది హారర్ లేదా థ్రిల్లర్ జానర్‌లో ప్రయోగాత్మకంగా సాగే కథ కావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆది చిత్రంతో అరంగేట్రం చేసిన తర్వాత, ప్రణవ్ తన పాత్రల విషయం లో చాలా సెలెక్టివ్ గా ఉంటూ భావోద్వేగ ప్రధానమైన కథల్లో నటిస్తున్నాడు. ఈసారి రాహుల్ వంటి దర్శకుడితో కలవడం ద్వారా, తన నటనలో మరింత లోతు చూపించేందుకు ఇది కీలక దశగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.