వాసుకి (పాకీజా)కి పవన్ ఆర్థిక సాయం
తెలుగు సినీ పరిశ్రమలో 1990లలో కామెడీ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందిన నటి వాసుకి అలియాస్ పాకీజా. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలో పాకీజా పాత్రతో గుర్తింపు పొందారు.;
తెలుగు సినీ పరిశ్రమలో 1990లలో కామెడీ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందిన నటి వాసుకి అలియాస్ పాకీజా. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలో పాకీజా పాత్రతో గుర్తింపు పొందారు. తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.
తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన వాసుకి అప్పట్లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించి అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా పనిచేశారు. తన భర్త రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం, అత్తమామల వేధింపులు, తల్లి క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చు చేసిన పరిస్థితుల కారణంగా ఆమె జీవితంలో తీవ్ర ఆటుపోటులు ఎదురయ్యాయి. జయలలిత మరణం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ప్రస్తుతం ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తాజాగా చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన సమయంలో గుంటూరులో మీడియా దృష్టికి పాకీజా పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన ఆమె తన గోడును వెల్లడిస్తూ, తెలుగు రాష్ట్రాల నుంచి సాయం కోరారు.
ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సాయాన్ని పాకీజాకు ఎమ్మెల్సీ హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు.
ఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు. ‘పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాను‘ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.