టోవినో థామస్ కు జోడీగా నజ్రియా నజీమ్
టోవినో థామస్, ఫహద్ ఫాసిల్ సతీమణి నజ్రియా నజీమ్ జోడీగా ఒక ప్రేమకథా చిత్రంలో సందడి చేయబోతున్నారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది.;
కొన్నిసార్లు కాంబినేషన్స్ ఊహించని విధంగా ఆశ్చర్యపరుస్తాయి. ఆహ్లాదకరంగా.. అనిపిస్తాయి. ఇప్పుడు మాలీవుడ్ లో అలాంటి కాంబో మూవీకి శ్రీకారం చుట్టారు. టోవినో థామస్, ఫహద్ ఫాసిల్ సతీమణి నజ్రియా నజీమ్ జోడీగా ఒక ప్రేమకథా చిత్రంలో సందడి చేయబోతున్నారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ కొత్త జంటను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిద్దరి కెమిస్ట్రీ తెరపై ఎలా ఉంటుందో అని ఆతృతగా ఉన్నారు.
మలయాళంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న నజ్రియా, 'రాజా రాణి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. నాని సరసన 'అంటే సుందరానికీ' మూవీలో నటించి తన నటనతో మెప్పించింది. రీసెంట్ గా 'సూక్ష్మదర్శిని' చిత్రంతో ఘన విజయం సాధించిన ఆమె.. ఇప్పుడు మొదటిసారి టోవినో థామస్‌తో జోడీ కట్టబోతోంది.
ఈ చిత్రం ఒక సరికొత్త ప్రేమకథ అని, ఇది వాస్తవిక భావోద్వేగాలను, హాస్యభరిత సన్నివేశాలను కలగలిపి ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ద్వారా ఈ ఊహించని జంట తమ ప్రతిభను చాటుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ముహ్సిన్ పరారి దర్శకత్వంలో ఏవీఏ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల అధికారికంగా ప్రకటన వెలువడింది.
ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. టోవినో సహజసిద్ధమైన నటన, నజ్రియా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, నానితో కలిసి నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న ఆదరణ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం దృశ్యపరంగా, భావోద్వేగాల పరంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.