ఓటీటీలోకి రాబోతున్న మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ !
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తొలిసారిగా దర్శకత్వం చేపట్టి.. తెరకెక్కించిన చిత్రం ‘బరోజ్ త్రీడీ’.;
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తొలిసారిగా దర్శకత్వం చేపట్టి.. తెరకెక్కించిన చిత్రం ‘బరోజ్ త్రీడీ’. కరోనా కారణంగా ఈ చిత్రం నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. ఎట్టకేలకు గత డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ ఎక్స్ వేదికగా జనవరి 22న ఓటీటీలో విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
‘బరోజ్ త్రీడీ’ కథ ఏంటంటే.. డిగామా అనే పోర్చుగీసు రాజు వంశానికి చెందిన ఓ విలువైన నిధిని కేంద్రంగా సాగేలా ఉంది. నాలుగు శతాబ్దాలుగా ఆ నిధిని కాపాడుతూ వస్తున్న బరోజ్ అనే వ్యక్తిగా మోహన్‌లాల్ నటించారు. ఆ నిధిని డి గామా వారసులకే అప్పగించాలనే ప్రమాణంతో బరోజ్ ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో రాజవంశానికి పదమూడో తరానికి చెందిన ఇసబెల అనే యువతి (మాయా రావు) తన తండ్రితో కలిసి గోవాకు వస్తుంది. ఇసబెల నిజంగా రాజవంశానికి చెందినదా? బరోజ్ ఆ నిధిని ఎలా కాపాడి ఉంచాడు? నిధి ఆమెకు అప్పగించాడా లేదా? వంటి ప్రశ్నలకు జవాబులు తెరపై ఆసక్తికరంగా తెలియజేశారు.
మోహన్‌లాల్ నటన, దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ఈ కథలోని మిస్టరీ మరియు ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ చిత్రాన్ని ఒకసారి చూడాల్సిందే.