మలయాళ నటుడు రవికుమార్ కన్నుమూత

ఆరంభంలో సహాయ పాత్రలతో సినీ ప్రస్థానం మొదలైన రవికుమార్.. 1975లో ‘ఉల్లాస యాత్ర’ చిత్రం తో హీరోగా మారారు. తమిళంలో ‘అవర్‌గళ్‌’ ద్వారా అడుగుపెట్టి.. ‘పగలిల్‌ ఒరు ఇరవు’ చిత్రం ద్వారా గొప్ప గుర్తింపు పొందారు.;

By :  K R K
Update: 2025-04-05 02:06 GMT

ప్రముఖ మలయాళ నటుడు రవికుమార్ (75) ఇకలేరు. కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళలోని త్రిశూర్‌కు చెందిన రవికుమార్ 1968 లో ‘లక్ష ప్రభు’ అనే మలయాళ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆరంభంలో సహాయ పాత్రలతో సినీ ప్రస్థానం మొదలైన రవికుమార్.. 1975లో ‘ఉల్లాస యాత్ర’ చిత్రం తో హీరోగా మారారు. తమిళంలో ‘అవర్‌గళ్‌’ ద్వారా అడుగుపెట్టి.. ‘పగలిల్‌ ఒరు ఇరవు’ చిత్రం ద్వారా గొప్ప గుర్తింపు పొందారు.

ఆ తర్వాత ‘యూత్’, ‘రమణ’, ‘లేసా లేసా’, ‘శివాజీ’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా ఆయనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రాధిక శరత్‌కుమార్ నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ రూపొందించిన ‘చిత్తి’ (తెలుగులో ‘పిన్ని’), ‘సెల్వి’ వంటి హిట్ సీరియళ్లలో నటించారు. తెలుగులో ప్రసారమైన ‘అనుబంధం’ సీరియల్‌లోనూ నటించి ప్రేక్షకుల హృదయాలు గెలిచారు.

సినీ రంగంలో సుదీర్ఘంగా 50 సంవత్సరాలకు పైగా సేవలందించిన రవికుమార్ మలయాళం, తమిళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలోనూ మేటి నటన కనబరిచారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవికుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags:    

Similar News