‘ఎంపురాన్’ లో వాడిన హెలీకేఫ్టర్ కథ ఇదే !
అపాచే హెలికాప్టర్‌ను ఈ సినిమా కోసం అద్దెకు తీసుకురాలేదు, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించలేదు.;
‘లూసిఫర్’ మలయాళం మూవీ విడుదలై.. దాదాపు ఆరు సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మోహన్‌లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి ‘L2: ఎంపురాన్’ అనే భారీ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 26న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా.. అందులో మోహన్‌లాల్ ఎంట్రీకి ఉపయోగించిన AH-64 అపాచే హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ హెలికాప్టర్లలో ఒకటిగా భావించే అపాచే హెలికాప్టర్‌ను ఈ సినిమా కోసం అద్దెకు తీసుకురాలేదు, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించలేదు. భారత్‌లో అపాచే హెలికాప్టర్లు అందుబాటులో లేకపోవడంతో.. చిత్రబృందం దాన్ని రీక్రియేట్ చేయాలని నిర్ణయించింది.
ప్రొడక్షన్ డిజైనర్ మోహన్‌దాస్ నేతృత్వంలో... పృథ్వీరాజ్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, 2023లో హెలీకేఫ్టర్ నిర్మాణ ప్రోసెస్ మొదలైంది. దాదాపు ఆరు నెలలు విశేష కృషి చేసి.. అచ్చంగా అపాచే హెలికాప్టర్‌ను పోలినట్టుగా దాన్ని తయారు చేశారు. ఈ సినిమా మూడు సంవత్సరాలుగా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ హెలికాప్టర్ నిర్మించాల్సిన అవసరం తొందరగానే గుర్తించింది టీమ్ . దాని నిర్మాణం, కాక్‌పిట్, బాహ్య స్వరూపం అన్నీ నిజమైన అపాచేకే సమానంగా ఉండేలా తయారు చేయడం కోసం విమానయాన నిపుణులు.. ఇంజనీర్లతో కలిసి పని చేశారు. ఈ సినిమా కోసం మాత్రమే కాకుండా, తదుపరి భాగంలో కూడా దీన్ని ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది.
ఈ హెలికాప్టర్ నిర్మాణం కోసం అల్యూమినియం, ఫైబర్‌గ్లాస్ వంటి తేలికపాటి పదార్థాలను ఉపయోగించారు. హెలికాప్టర్‌లోని సూక్ష్మ భాగాలను రూపొందించేందుకు ఆధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతను వినియోగించారు. మిసైల్ పోడ్స్, కాక్‌పిట్ కంట్రోల్స్, ఇతర యాంత్రిక భాగాలన్నీ నిజమైన హెలికాప్టర్‌లా కనిపించేలా తయారు చేశారు. అంతేకాకుండా, హెలికాప్టర్‌లోని కొన్ని భాగాలను కదిలేలా చేయడం కోసం ప్రత్యేకంగా రోటర్ బ్లేడ్స్ అమర్చారు. అంతేగాక, కాక్‌పిట్‌లో LED స్క్రీన్లను ఏర్పాటు చేసి, వాటిలో నిజమైన విమాన నియంత్రణ వ్యవస్థల లాంటి అనుభూతిని కలిగించేలా రూపొందించారు.
ఈ హెలికాప్టర్ మోడల్‌ను ప్రధానంగా క్లోజప్ షాట్స్ కోసం ఉపయోగించారు. అయితే.. గగనంలో ఎగురుతున్న దృశ్యాలు, యుద్ధ దృశ్యాలను మరింత సహజంగా చూపించేందుకు గ్రాఫిక్స్ ద్వారా హెలికాప్టర్‌కు మెరుగుదల చేశారు. పోస్ట్-ప్రొడక్షన్ ప్రక్రియలో సీజీఐ సాయంతో హెలికాప్టర్ ఫ్లైట్ మోషన్, యాక్షన్ సీన్స్‌ను మరింత యథార్థంగా తీర్చిదిద్దారు.