ఎన్టీఆర్ కోసం విలన్ గా మలయాళీ స్టార్?
విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. హీరో పాత్ర అంతలా ఎలివేట్ అవుతోంది. అందుకే హీరోలకు దీటైన విలన్లుగా మరో భాషలోని హీరోలను దించుతున్నారు మన మేకర్స్.;
విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. హీరో పాత్ర అంతలా ఎలివేట్ అవుతోంది. అందుకే హీరోలకు దీటైన విలన్లుగా మరో భాషలోని హీరోలను దించుతున్నారు మన మేకర్స్. ప్రెజెంట్ తెలుగులో బాలీవుడ్ హీరోలతో పాటు మాలీవుడ్ హీరోలు కూడా విలన్లుగా నటిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరుగా మలయాళీ స్టార్స్ మన కథానాయకుల కోసం ప్రతినాయకుల అవతారమెత్తుతున్నారు.
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నటులుగా మలయాళీ స్టార్స్ కి మంచి గుర్తింపు ఉంది. అందుకే వీరంతా కేవలం హీరోలుగానే ఫిక్సవ్వకుండా పాత్ర నచ్చితే ప్రతినాయకులుగా సైతం అలరించడానికి సిద్ధమవుతుంటారు. ఈ కోవలోనే అల్లు అర్జున్ 'పుష్ప'లో ప్రతినాయకుడిగా నటించాడు మలయాళీ స్టార్ ఫహాద్ ఫాజిల్. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్‘ కోసం విలన్ గా మారాడు మరో స్టార్ పృథ్వీరాజ్. ‘సలార్‘ ఫస్ట్ పార్ట్ లో పృథ్వీరాజ్ రోల్ పాజిటివ్ గా ఉన్నా.. సెకండ్ పార్ట్ లో అతనే మెయిన్ విలన్.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే రూపొందుతున్న ఎన్టీఆర్ సినిమాలోనూ మరో మలయాళీ స్టార్ టోవినో థామస్ నటించబోతున్నాడట. మలయాళంలో అగ్రపథాన దూసుకెళ్తున్న టోవినో థామస్ ‘మిన్నల్ మురళి, 2018, ఎ.ఆర్.ఎమ్‘ వంటి అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నవాడే.
షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుందనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి బరిలో ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది.