లాస్టియర్ డిజప్పాయింట్ చేసినా.. ఈ ఏడాది సాలిడ్ గా కొట్టాడు!

Update: 2025-01-16 08:30 GMT

సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగే. ఆ పండగకు సంబంధించి స్టార్ హీరోలు తమ సినిమాలతో బరిలోకి దిగడం ఆనవాయితీ. ఈ తరహాలో సంక్రాంతి విడుదలల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో నిలుస్తాడు. గతంలో ఈ పండగకు అతడు అందించిన చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి.

2019లో వచ్చిన ‘ఎఫ్-2’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2024లో ‘సైంధవ్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు వెంకీ. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ‘హిట్’ సిరీస్‌తో గుర్తింపు పొందిన శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కినప్పటికీ.. విడుదల సమీపించేకొద్దీ ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందనతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద బలం తగ్గింది. ఫుల్ రన్‌లో కేవలం 7-8 కోట్ల షేర్ రాబట్టడం మాత్రమే సాధ్యమైంది.

అయితే, సంక్రాంతి 2025లో విడుదలైన వెంకీ తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం వెంకీ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజే ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా గ్రాస్, రూ.25 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇదే కాలంలో వచ్చిన ‘సైంధవ్’ సినిమా మొత్తం రన్‌లో సాధించిన వసూళ్లను ఒక్క రోజులోనే మించి వెళ్ళడమే ఈ చిత్ర విజయాన్ని హైలైట్ చేస్తోంది.

ఈ సినిమాతో వెంకీకి ఫ్యామిలీ ఎంటర్టైనర్లే మరింత సూటవుతాయని మరోసారి స్పష్టమైంది. గతంలో ‘కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి సినిమాలు కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఎఫ్-2’ వంటి మల్టీ-స్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ కూడా భారీ విజయాన్ని అందించింది.

Tags:    

Similar News