మహా యుద్ధానికి తెరలేపిన రిషబ్ శెట్టి!
కన్నడ సెన్సేషనల్ స్టార్ రిషభ్ శెట్టి క్రేజీ మూవీ ‘కాంతారా: చాప్టర్ 1’. ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన దృశ్య అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం 50 రోజుల పాటు అఖండ యుద్ధ ఘట్టాన్ని చిత్రీకరించనున్నారు. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ భారీ యుద్ధాన్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం విశేషమైన కసరత్తు చేస్తోంది. ఇండియన్ స్ర్కీన్ పై ఇప్పటివరకు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యుద్ధ దృశ్యం చిత్రీకరించడం చాలా అరుదు.
‘కాంతారా’ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చిన ప్రకృతి సహజమైన వాతావరణాన్ని ఈసారి మరింత ప్రామాణికంగా చూపించేందుకు టీమ్ సిద్ధమవుతోంది. మోడ్రన్ సెట్ల హంగులను పూర్తిగా వదిలి, చిత్రీకరణ కోసం ఒక ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. తక్కువ సౌకర్యాలే అందుబాటులో ఉన్నప్పటికీ , రిషబ్ శెట్టి సహా చిత్రబృందం మొత్తం నెలరోజుల పాటు అక్కడే నివసిస్తూ చిత్రీకరణను కొనసాగించనున్నారు. ప్రకృతి దృశ్యాలను అతి సహజంగా చూపించేందుకు.. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకుడికి నిజమైన అనుభూతిని కలిగించేందుకు ఈ సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ‘కాంతారా: చాప్టర్ 1’ చిత్రంలో భారతీయ చిత్రసీమలో ఇప్పటివరకు చూడని అద్భుతమైన యుద్ధ దృశ్యం ఉండనుంది. హోంబాళే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం రిషబ్ శెట్టి 45-50 రోజులపాటు ఈ యుద్ధ ఘట్టంపై ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది. ఈ భారీ యుద్ధాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం తన సర్వశక్తులను వినియో గించుకుంటోంది.
కాంతారా మొదటి భాగం కథ మిస్టికల్ ఫోక్ లోర్‌తో ప్రేక్షకులను ఓ భిన్న ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కానీ, ఈ ప్రీక్వెల్ పూర్తి భిన్నంగా, అత్యంత శక్తివంతమైన యుద్ధ ఘట్టాలతో, నాటి వీరగాథలను తలపించే విధంగా రూపొందుతోంది. ఈ భారీ యుద్ధ దృశ్యాలు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి. రిషబ్ శెట్టి నటనతో, సాంకేతిక నిపుణుల మేథస్సుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాక.. మరింత ఎక్కువ ఆశలను పెంచే విధంగా ఉండనుంది. ఈ అద్భుతమైన దృశ్యకావ్యం స్క్రీన్‌పై ఎలా కనిపిస్తుందో చూడటానికి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.