కోట మృతిపై కందుల దుర్గేష్ సంతాపం
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గాఢ సంతాపం తెలిపారు.;
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గాఢ సంతాపం తెలిపారు. "తెలుగు వారిగుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి తీరని లోటు," అని మంత్రి పేర్కొన్నారు.
విలన్‌గా, కమెడియన్‌గా, తండ్రిగా, రాజకీయ నాయకుడిగా ఇలా అనేక భిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేసిన కోట, 750కు పైగా సినిమాల్లో నటించిన గొప్ప నటుడు అని కొనియాడారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావుల తరం తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడు కోట శ్రీనివాసరావు అని మంత్రి అన్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ నటించిన కోట శ్రీనివాసరావు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ప్రతీ పాత్రకు న్యాయం చేశారని, ఆయన నటన చిరస్మరణీయమై ఉంటుందని మంత్రి అన్నారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోలతో పాటు యువ హీరోలతోనూ నటించి ఎన్నో అవార్డులు అందుకున్న కోటకు పద్మశ్రీ వంటి గౌరవాలు కూడా లభించాయన్నారు.