మాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న జంగ్లీ పిక్చర్స్
జంగ్లీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తమ తొలి మలయాళ చిత్రం ‘రోంత్’ (నైట్ పెట్రోల్) తో మలయాళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టబోతోంది. నేషనల్ అవార్డ్ గ్రహీత షాహి కబీర్ రాసి.. దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. హిందీ చిత్రాలతో తన ప్రస్థానాన్ని విస్తరించిన జంగ్లీ పిక్చర్స్ కోసం మరో కీలకమైన ప్రయోగంగా మారనుంది. దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్‌ను జంగ్లీ పిక్చర్స్ ఫెస్టివల్ సినిమాస్‌తో కలిసి విడుదల చేసింది.
"రోంత్" కథ ఒక రాత్రంతా జరుగుతుంది. నైట్ పెట్రోల్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారుల ప్రయాణం.. ఆ రాత్రి సంభవించే అనేక ఉద్వేగభరిత సంఘటనలు, వారి వృత్తిపరమైన కష్టాలు, వ్యక్తిగత సమస్యలు కలిసి కథను మరింత ఆసక్తికరంగా మలుస్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి మహేష్ మాధవన్ సినిమాటోగ్రఫీ, అనిల్ జాన్సన్ సంగీతం అందిస్తున్నారు. 2014లో టైమ్స్ గ్రూప్ అనుబంధంగా స్థాపించిన జంగ్లీ పిక్చర్స్ .. రాజీ, తల్వార్, బధాయీ హో, బధాయీ దో, బరేలీ కి బర్ఫీ లాంటి విజయ వంతమైన సినిమాలతో ప్రసిద్ధి పొందింది. మలయాళ పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు "రోంత్" సరైన చిత్రం అనిపించడంతో, దీనికి నిర్మాతలుగా వినీత్ జైన్, రతీష్ అంబాట్, రంజిత్ ఈవీఎం, జోజో జోస్ వ్యవహరిస్తుండగా, అమృతా పాండే సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీ కొప్ప, అరుణ్ చెరుకావిల్, లక్ష్మీ మీనన్, కృష్ణ కురుప్, నందనున్ని తదితరులు కూడా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.