పొలిటికల్ డ్రామాతో అదరగొట్టబోతున్న జాన్ అబ్రహం !
బాలీవుడ్ క్రేజీ స్టార్, నిర్మాత జాన్ అబ్రహం తాజా పొలిటికల్ డ్రామా 'ది డిప్లొమాట్'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్‌లో జాన్ అగ్రెసివ్ లుక్ తో బ్లాక్ సూట్‌లో మెరిసిపోతున్నాడు. ఈ చిత్రంలో జాన్ నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమా దేశానికి అంత్యంత ప్రభావాన్ని కలిగించిన నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతోంది.
తన సోషల్ మీడియా ఖాతా ద్వారా జాన్ ఈ చిత్ర పోస్టర్‌ను షేర్ చేస్తూ, "సాహసం, దౌత్యం కలగలిసిన ఈ కథను తెరపై ఆవిష్కరించగలగడం గౌరవంగా భావిస్తున్నాను. మర్చి 7న థియేటర్లలో కలుద్దాం.." అని పేర్కొన్నాడు. ఈ సినిమాకు శివం నాయర్ దర్శకత్వం వహిస్తుండగా.. రితేశ్ షా స్క్రిప్ట్ అందించారు.
టీ-సిరీస్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, జెఏ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి జాన్ అబ్రహం, వకావో ఫిలిమ్స్‌కి చెందిన విపుల్ డి షా, అశ్విన్ వర్దే, రాజేష్ బహల్, ఫార్చ్యూన్ పిక్చర్స్‌కి చెందిన సమీర్ దిక్షిత్ మరియు జతీష్ వర్మ, అలాగే సీతా ఫిలిమ్స్‌కి చెందిన రాకేష్ డాంగ్ కలిసి నిర్మిస్తున్నారు. జాన్ అబ్రహం ఇంతకు ముందు 'వేదా' చిత్రంలో కనిపించగా.. ప్రస్తుతం 'డిప్లొమాట్'తో పాటు 'తెహ్రాన్' అండ్ 'తారిక్' చిత్రాలు కూడా అతడి చేతిలో ఉన్నాయి.