‘జన నాయగన్’ ఓటీటీ డీల్!
తమిళ దళపతి విజయ్ కెరీర్‌లో అత్యంత కీలక చిత్రంగా రూపొందుతుంది 'జన నాయగన్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.;
తమిళ దళపతి విజయ్ కెరీర్‌లో అత్యంత కీలక చిత్రంగా రూపొందుతుంది 'జన నాయగన్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, మమిత బైజు మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను విజయ్ తన చివరి చిత్రంగా ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇదే సమయంలో, ఆయన రాజకీయాలలో పూర్తిగా నిమగ్నమవ్వబోతుండడం కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ హెచ్.వినోద్. వచ్చే ఏడాది పొంగల్ రేసులో విడుదలకు ముస్తాబవుతున్న 'జన నాయగన్' ఓటీటీ రైట్స్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 'జన నాయగన్' డిజిటల్ హక్కులను రూ.121 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్టు తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఈ ఒప్పందం విజయ్ కెరీర్‌లో 'లియో' తర్వాత అత్యధిక రేటుతో అమ్ముడైన ఓటీటీ డీల్ గా అభివర్ణిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.