'జాబిలమ్మ నీకు అంత కోపమా' రివ్యూ

Update: 2025-02-21 08:51 GMT

నటీనటులు: పవిష్, అనిఖ సురేంద్రన్, ప్రియ ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, శరణ్య, రమ్య రంగనాథన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

నిర్మాతలు: కస్తూరి రాజా-విజయలక్ష్మి

దర్శకత్వం: ధనుష్

విడుదల తేది: 21-02-2025

ఒకవైపు వెండితెరపై విలక్షణ పాత్రలతో అలరించే ధనుష్.. మరోవైపు మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగానూ దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది డైరెక్టర్ గా ‘రాయన్’తో ఘన విజయాన్నందుకున్న ధనుష్.. ఇప్పుడు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ప్రభు (పవిష్) ఒక ప్రతిభావంతమైన చెఫ్. అతను నీల (అనికా సురేంద్రన్)ను ప్రేమిస్తాడు. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ప్రేమ విఫలమై, బ్రేకప్ బాధ నుంచి తేరుకునే లోపే, ప్రభు తల్లిదండ్రులు అతని పెళ్లిని ప్రీతి (ప్రియా ప్రకాష్ వారియర్)తో ఖరారు చేస్తారు.

ఒకప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అయిన ప్రభు, ప్రీతి పెళ్లి ముందుగా ఒకరికొకరు తెలిసికొనాలని నిర్ణయించుకుంటారు. కలిసి ప్రయాణం చేస్తూ, కొత్త అనుభూతుల్ని పంచుకుంటారు. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో, ప్రభుకు తన మాజీ ప్రేయసి నీల పెళ్లి ఆహ్వానం అందుతుంది.

నీలను మరిచిపోలేక బాధపడుతున్న ప్రభు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రీతి, అతని ప్రేమకథను తెలుసుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ప్రభు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది. చివరకు ఏం జరిగింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ధనుష్‌ అంటేనే ఓ వైపు నటనలో అద్భుతమైన ప్రతిభ, మరోవైపు దర్శకుడిగా విభిన్న కథలను తెరపై చూపించగల నేర్పు. ‘పవర్ పాండి’తో ఎమోషనల్ డ్రామాను, ‘రాయన్’తో యాక్షన్ థ్రిల్లర్‌ను పరిచయం చేసిన ధనుష్ ఇప్పుడు మూడో ప్రయత్నంగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’తో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీని అందించే ప్రయత్నం చేశాడు.

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ కథ పరంగా పెద్ద కొత్తదేమీ కాదు. ప్రేమలో పడిన యువకుడు – బ్రేకప్ – కొత్త సంబంధం – గతం తిరిగి రావడం వంటి ఎప్పటినుంచో చూసిన అంశాలతో నడిచే కథే. అయితే కథ ఎంత సాదాసీదా అయినా దాన్ని ధనుష్ స్టైలిష్ ట్రీట్మెంట్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో నేటితరం యువత అభిరుచికి తగ్గట్టుగా మలిచాడు.

ఇలాంటి టెంప్లేట్ ప్రేమకథలను ఎన్నోసార్లు చూసినప్పటికీ, ధనుష్‌ ట్రెండీ ట్రీట్మెంట్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. సెకండాఫ్ లో స్టోరీ పూర్తిగా గోవాకు షిఫ్ట్ అవుతుంది. నీల పెళ్లిని చూసేందుకు ప్రభు వెళ్లడం, అక్కడ ఏర్పడే చిలిపి సంఘటనలు ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రధానంగా హీరో కంటే ఎక్కువగా ఆకర్షించే క్యారెక్టర్ అతని స్నేహితుడు రాజేష్ (మాథ్యూ థామస్). ఈ పాత్ర ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

ఇలాంటి కథల్లో హీరో తన మాజీ ప్రేయసిని తిరిగి గెలుచుకుంటాడా? లేక కొత్త ప్రేమనే స్వీకరిస్తాడా? అనేది ప్రధాన ఆసక్తి. అయితే ధనుష్ ఈ విషయంలో టిపికల్ ఎండింగ్ ఇచ్చి సెకండ్ పార్ట్ వచ్చే అవకాశముందేమో! అనిపించేలా చేశాడు. ఈ అసంపూర్ణ ముగింపు కొంతమందికి నిరాశ కలిగించవచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన పవిష్.. ఓ సాదాసీదా మధ్య తరగతి కుర్రాడి పాత్రకు అనువుగా నటించాడు. ఇతను ధనుష్ మేనల్లుడు కావడం విశేషం. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన అనిఖ సురేంద్రన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ చిన్నపిల్లగానే అనిపిస్తుంది. ప్రేమకథా చిత్రానికి అవసరమైన భావోద్వేగాల్ని ఆమె పూర్తిగా ఒడిసిపట్టలేకపోయింది.

ప్రియ ప్రకాష్ వారియర్ పాత్ర తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, తన హావభావాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభుకు మద్దతుగా నిలిచే సన్నివేశాల్లో ఆమె నటన మెచ్చుకోదగినది. ఈ సినిమాకు అసలు హీరో ఎవరు అంటే, అది మాథ్యూ థామస్ అనే చెప్పాలి. అతడు పోషించిన రాజేష్ పాత్రే చిత్రానికి అసలైన వినోదాన్ని తీసుకువచ్చింది. అతని యాస, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.

ధనుష్ సాధారణంగా అనిపించే కథను తనదైన ట్రీట్‌మెంట్‌తో ఆసక్తికరమైన స్క్రిప్ట్‌గా మార్చడంలో విజయం సాధించాడు. జి.వి.ప్రకాష్ మ్యూజిక్ విషయానికొస్తే న్యూఏజ్ స్టైల్, యూత్ ఫుల్ బీట్స్ తో రూపొందిన ‘గోల్డెన్ స్పారో’ సాంగ్ ఒక్కటే హైలైట్. ఈ పాటలో ప్రియాంక అరుళ్ మోహన్ కేమియో ఆకట్టుకుంటుంది.

చివరగా:

'జాబిలమ్మ నీకు అంత కోపమా ' – నవ్వులతో సాగిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ!

Tags:    

Similar News