నటుడు, దర్శకుడు మనోజ్ భారతి రాజా హఠాన్మరణం

మార్చి 25, మంగళవారం చెన్నైలో ఆయన తన చివరి శ్వాస విడిచినట్లు సమాచారం. కేవలం 48 ఏళ్ల వయసులో ఆయన మరణించటం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.;

By :  K R K
Update: 2025-03-26 00:33 GMT

ప్రముఖ తమిళ దర్శకుడు భారతి రాజా కుమారుడు.. నటుడు, దర్శకుడు మనోజ్ భారతి రాజా గుండెపోటుతో మరణించారు. మార్చి 25, మంగళవారం చెన్నైలో ఆయన తన చివరి శ్వాస విడిచినట్లు సమాచారం. కేవలం 48 ఏళ్ల వయసులో ఆయన మరణించటం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

1999లో తన తండ్రి భారతి రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాజ్ మహల్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన మనోజ్.. ‘అల్లి అర్జున, కదల్ పూక్కల్, సముదిరం, ఈశ్వరన్, విరుమన్’ వంటి చిత్రాల్లో నటించారు. నటనలో తనదైన ముద్ర వేయడంతో పాటు, దర్శకుడిగా మారాలనే ఆసక్తితో 2023లో ‘మార్గళి తింగళ్’ అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి భారతి రాజానే నిర్మాతగా వ్యవహరించారు.

సినిమాపై ఉన్న అంకితభావం కారణంగా, మనోజ్ తన సినీ ప్రయాణాన్ని దర్శకునిగా ప్రారంభించడానికి ముందు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా, యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. తన చిరకాల స్నేహితురాలు, తమిళ నటి నందనను మనోజ్ 2006 నవంబర్ 19న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఆర్తికా, మథివధని ఉన్నారు. మనోజ్ భారతి రాజా అకస్మాత్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు.

Tags:    

Similar News