ప్రభాస్ పేరుతో ఫేక్ కాల్
నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో గత కొన్ని నెలలుగా డయాలసిస్‌తో చికిత్స అందుకుంటున్నారు.;
నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో గత కొన్ని నెలలుగా డయాలసిస్‌తో చికిత్స అందుకుంటున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఆయన ప్రాణాలను కాపాడడానికి ఏకైక మార్గమని వైద్యులు తెలిపారు. కానీ ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.50 లక్షల ఖర్చు అవుతుందని అంచనా.
ఈ క్లిష్ట పరిస్థితిలో ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, తమ తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, ఆయన పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. కిడ్నీ మార్పిడి కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం స్రవంతి పలువురు సినీ ప్రముఖులను, అభిమానులను సంప్రదించారు. ఈ సందర్భంలో, ప్రముఖ నటుడు ప్రభాస్ తమకు సాయం చేస్తారని వచ్చిన వార్తలపై స్రవంతి స్పష్టతనిచ్చారు.
ప్రభాస్ పీఏ అని చెప్పుకున్న ఒక వ్యక్తి తమకు ఫోన్ చేసి, శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని, కిడ్నీ దాతను సమకూర్చుకోమని హామీ ఇచ్చారని స్రవంతి తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు ఎవరూ స్పందించడం లేదని, ఎలాంటి సాయం ఇప్పటివరకు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇలాంటి ఫేక్ కాల్స్‌తో కాలయాపన చేసే సమయం ఇది కాదు. మా నాన్న ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. సాయం చేయగలిగిన వారు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుతున్నాము,‘ అని స్రవంతి కన్నీటితో వేడుకున్నారు.