క్లాష్ కన్ఫర్మ్.. బాలయ్య vs పవన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చారిత్రక నేపథ్యంతో రూపొందిన 'హరిహర వీరమల్లు' సినిమాను పూర్తి చేసి, ప్రస్తుతం 'ఓజీ' సినిమాపై దృష్టి పెట్టాడు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చారిత్రక నేపథ్యంతో రూపొందిన 'హరిహర వీరమల్లు' సినిమాను పూర్తి చేసి, ప్రస్తుతం 'ఓజీ' సినిమాపై దృష్టి పెట్టాడు. ఎ.ఎమ్. రత్నం నిర్మాణంలో, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'హరిహర వీరమల్లు' జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది.
మరోవైపు డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ' సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే మూడు నెలల గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
అయితే దసరా బరిలోనే నటసింహం బాలకృష్ణ 'అఖండ 2' సినిమా కూడా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. మిగిలిన పాటల చిత్రీకరణతో పనులు ముగించేందుకు టీమ్ కసరత్తులు చేస్తోంది. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక బాలయ్య, పవన్ ఇద్దరూ సినిమాల విషయంలోనే కాదు.. రాజకీయంగా కూడా ఒకే వేదికపై ఉన్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వద్ద వారిద్దరి సినిమాలు ఒకే రోజున పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, 'అఖండ 2'ను దసరా బరిలో నుంచి వచ్చే సంక్రాంతికి వాయిదా వేయాలనే ఆలోచన జరుగుతోంది. అందుకే 'ఓజీ'కు దసరా రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారనే ప్రచారం వినిపిస్తోంది.
అయితే 'అఖండ 2' వాస్తవంగా సెప్టెంబర్ 25నే విడుదల కానుందా? లేక వాయిదా పడుతుందా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ రెండు మాస్ స్టార్ సినిమాల విడుదల తేదీల చుట్టూ ఆసక్తికర చర్చే సాగనుంది.