చిరంజీవే నా ఇన్స్పిరేషన్ – బన్నీ
ముంబై వేదికపై ‘వేవ్స్’ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) కార్యక్రమం ప్రారంభమైంది. మే 1 నుండి మే 4 వరకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది.;
ముంబై వేదికపై ‘వేవ్స్’ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) కార్యక్రమం ప్రారంభమైంది. మే 1 నుండి మే 4 వరకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నాలుగు రోజుల సదస్సు భారతీయ మీడియా, వినోద రంగాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది .
ఈ భారీ సదస్సుకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు. తన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, తాత అల్లు రామలింగయ్య వెయ్యి సినిమాల్లో నటించారని, తండ్రి అల్లు అరవింద్ 70కి పైగా సినిమాలు నిర్మించారని, ముఖ్యంగా మావయ్య చిరంజీవి తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అని స్పష్టం చేశాడు. 'నటుడిగా నేను మారడానికే చిరంజీవి కారణం' అని బన్నీ పేర్కొనడం విశేషం. ఇటీవల మెగా-అల్లు బంధంపై వివాదాల తరుణంలో అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇదే వేదికపై బన్నీ కుటుంబ నేపథ్యంతో పాటు తన ఫిట్‌నెస్, సినీ ప్రయాణం, మెంటల్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు. 'శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతే కీలకం' అని స్పష్టం చేసిన అల్లు అర్జున్, సిక్స్‌ప్యాక్ కోసం ఓ దశలో కష్టపడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. డ్యాన్స్ తనకు చిన్ననాటి నుంచీ సహజంగా వచ్చిందని.. తాను ట్రైనింగ్ తీసుకోకుండా నేర్చుకున్నానని తెలిపాడు.
డైరెక్టర్ అట్లీతో చేస్తున్న తదుపరి చిత్రం (#AA22) గురించి మాట్లాడుతూ, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ఉండబోతుందని, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపాడు.