‘విట్టా’ గా ఆకట్టుకోబోతున్న శ్రద్ధా కపూర్
ఈ బయోపిక్ ఆమెను తన గత ఇమేజ్ నుంచి పూర్తిగా భిన్నమైన రూపంలో చూపించి, ఆమె నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.;
సాధారణంగా రొమాంటిక్, గ్లామరస్ పాత్రల్లో కనిపించే అందాల హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇప్పుడు తన కెరీర్ పెద్ద టర్న్ తీసుకోబోతోంది. ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత.. దాదాపు సంవత్సరం పాటు ఆమె కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె తదుపరి అడుగు ఏమిటని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వార్త బయటకొచ్చింది.
శ్రద్ధ.. మహారాష్ట్ర జానపద లెజెండ్ విట్టాబాయి భావు మాంగ్ నారాయణ్ గావుంకర్ జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్‌లో నటించబోతోంది. విట్టాబాయి తమాషా సాంప్రదాయంలో పెద్ద పేరు సంపాదించిన గొప్ప జానపద కళాకారిణిగా గుర్తింపు పొందారు. ఆమె జీవితం కళ, సంఘర్షణ, గర్వంతో నిండి ఉంది. అలాంటి పాత్రను పోషించడం ఏ నటికైనా సవాల్‌తో కూడుకున్న విషయం. శ్రద్ధా కెరీర్‌లో ఇది ఇప్పటివరకూ ఆమె చేసిన అత్యంత ధైర్యమైన పాత్ర కావచ్చు. ఈ బయోపిక్ ఆమెను తన గత ఇమేజ్ నుంచి పూర్తిగా భిన్నమైన రూపంలో చూపించి, ఆమె నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రానికి ‘విట్టా’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరు మహారాష్ట్ర జానపద స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, సినిమాకు సరైన రుచిని ఇస్తుందని అభిమానులు అంటున్నారు. శ్రద్ధా ఇలాంటి భిన్నమైన ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది, ఎందుకంటే ఇది ఆమె సాధారణ సినిమాలకు పూర్తి భిన్నం. ఈ ప్రాజెక్ట్ కేవలం కమర్షియల్ సినిమాగా కాకుండా, గొప్ప సాంస్కృతిక నివాళిగా నిలవనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.