గ్లోబల్ లెవెల్లో ప్రియాంకాకు అరుదైన గౌరవం !

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే వ్యక్తులను గుర్తించి సన్మానించే ప్రతిష్ఠాత్మక సంస్థ గోల్డ్ హౌస్ గాలా నుంచి ప్రియాంకాకి గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్ అవార్డు లభించింది.;

By :  K R K
Update: 2025-04-23 05:04 GMT

ప్రియాంకా చోప్రా అంటే కేవలం ఒక నటి మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గ్లామర్, ప్రతిభ, ప్రభావం కలగలిపిన ఒక అద్భుత వ్యక్తిత్వం. బాలీవుడ్‌లో ఆమె సాధించిన విజయాలు, హాలీవుడ్‌లో ఆమె చూపించిన సత్తా గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె తన జర్నీలో మరో గొప్ప అడుగు వేస్తూ.. టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ29లో నటించబోతోంది. ఇది ఆమె తెలుగు సినిమా రంగంలో మొదటి అడుగు కావడం విశేషం. అయితే, ఈ సినిమా ప్రారంభం కాకముందే ఆమెకు మరో అదిరిపోయే గౌరవం దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే వ్యక్తులను గుర్తించి సన్మానించే ప్రతిష్ఠాత్మక సంస్థ గోల్డ్ హౌస్ గాలా నుంచి ప్రియాంకాకి గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్ అవార్డు లభించింది. ఈ అవార్డు అంటే సాధారణమైనది కాదు. ప్రపంచంలో మార్పు తీసుకొచ్చే నాయకులకు, కళారంగంలోనో, సమాజంలోనో గొప్ప పనులు చేసే వాళ్లకు మాత్రమే ఇస్తారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను ఎంపిక చేసే ఈ సంస్థ, ఈ ఏడాది భారతదేశం నుంచి ఒక్క ప్రియాంకానే ఎంచుకుంది. ఇది ఆమె ప్రపంచవ్యాప్త ఆదరణతో పాటు, దక్షిణాసియా స్వరాలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించే ఆమె నిరంతర కృషికి నిదర్శనం.

ఈ అవార్డును మే 10వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షికోత్సవ వేడుకలో ప్రియాంకాకి అందజేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యూజిక్ సెంటర్ అనే గొప్ప వేదికపై జరగనుంది. ఈ ఏడాది ఈ అవార్డు లిస్ట్‌లో భారత్ నుంచి ఆమె ఒక్కరే ఉండటం మనందరికీ గర్వకారణం. ప్రియాంకా కేవలం ఒక నటిగానే కాకుండా, సామాజిక కార్యకర్తగా, నిర్మాతగా, గ్లోబల్ ఐకాన్‌గా ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్‌లో బాజీరావ్ మస్తానీ, మేరీ కోమ్ లాంటి సినిమాలతో మొదలై, హాలీవుడ్‌లో క్వాంటికో, మ్యాట్రిక్స్ లాంటి ప్రాజెక్టులతో ఆమె సాధించిన విజయాలు ఆమె బహుముఖ ప్రతిభకు అద్దం పడతాయి.

Tags:    

Similar News