హాలీవుడ్ నటుడు మైకేల్ మాడ్సెన్ కన్నుమూత

‘రిజర్వాయర్ డాగ్స్, కిల్ బిల్’ వంటి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన నటుడు మాడ్సెన్. కాలిఫోర్నియాలోని మాలిబులోని తన నివాసంలో మృతి చెందారు.;

By :  K R K
Update: 2025-07-04 04:17 GMT

ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ (67) కన్నుమూశారు. క్వెంటిన్ టోరంటినో చిత్రాలైన ‘రిజర్వాయర్ డాగ్స్, కిల్ బిల్’ వంటి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన నటుడు మాడ్సెన్. కాలిఫోర్నియాలోని మాలిబులోని తన నివాసంలో మృతి చెందారు. గుండెపోటు మరణానికి కారణంగా తెలుస్తోంది.

‘సిన్ సిటీ, డై అనదర్ డే, డోనీ బ్రాస్కో, ఫ్రీ విల్లీ, ది డోర్స్, వార్ గేమ్స్, ది హేట్‌ఫుల్ ఎయిట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించారు మాడ్సెన్. 2024లో విడుదలైన ‘మాక్స్ డాగన్’ అనే చిత్రంలో చివరిగా కనిపించారు. అనుష్కా శెట్టి హీరోయిన్‌గా నటించిన ‘నిశ్శబ్దం’ అనే తెలుగు చిత్రంలో కూడా మాడ్సెన్ నటించారు. ఈ చిత్రం 2020 లో విడుదలైంది.

1983లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘వార్ గేమ్స్’ ద్వారా మాడ్సెన్ తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే సమయంలో టెలివిజన్ సీరియల్స్‌లో కూడా తన సాన్నిధ్యాన్ని చాటుకున్నారు. 1992 లో విడుదలైన ‘రిజర్వాయర్ డాగ్స్’ మాడ్సెన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ చిత్రంలో క్రూరమైన బ్లాండే పాత్రలో మాడ్సెన్ అద్భుతంగా నటించారు.

1980ల ప్రారంభం నుండి మాడ్సెన్ 300కు పైగా ప్రాజెక్టులలో నటించారు. 2024లో.. మాడ్సెన్ తన మాజీ భార్య డియానాతో గొడవ పడిన తర్వాత గృహ హింస ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. రెండు వివాహాలు చేసుకున్న మాడ్సెన్ కు ఐదుగురు సంతానం. 

Tags:    

Similar News