రెండో రోజున కలెక్షన్స్ లో 75 శాతం గ్రోత్ !

స్కై ఫోర్స్ మొదటి రోజు రూ.12 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రెండో రోజుకు అదే జోరుతో కలెక్షన్లు రూ.22 కోట్ల నెట్ వరకు చేరాయి.;

By :  K R K
Update: 2025-01-27 00:57 GMT

బాలీవుడ్ ఖిలాడీ .. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘స్కై ఫోర్స్’. జనవరి 24న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. 1965 భారత-పాక్ యుద్ధం సమయంలో సర్గోదా వైమానిక స్థావరంపై దాడి ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ అందుకుంది. రిపబ్లిక్ డే వీక్‍లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.

స్కై ఫోర్స్ మొదటి రోజు రూ.12 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రెండో రోజుకు అదే జోరుతో కలెక్షన్లు రూ.22 కోట్ల నెట్ వరకు చేరాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజున దాదాపు 75% గ్రోత్ కనిపించిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.34 కోట్ల నెట్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను నమోదు చేసింది.

స్కై ఫోర్స్ సినిమాకు మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడమే కాకుండా.. బాలీవుడ్‌లో పెద్దగా పోటీ లేకపోవడం వసూళ్ల జోరుకు కలిసొచ్చింది. ఇక మూడో రోజు రిపబ్లిక్ డే కానుకగా టికెట్ బుకింగ్స్ ట్రెండ్ మరింత పుంజుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వార్ బ్యాక్‌డ్రాప్ మూవీకి సందీప్ కెవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్‌తో పాటు సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, శరద్ కేల్కర్, మోహిత్ చౌహాన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. రూ.160 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, మాడ్‌డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సంగీతాన్ని తనిష్క్ బాగ్చి, జస్టిన్ వర్గీస్ అందించారు. స్కై ఫోర్స్ అక్షయ్‌కు ఎంతోకాలం తర్వాత పెద్ద హిట్ అవుతుందని బాలీవుడ్ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

Tags:    

Similar News