బాలయ్య విలన్ జన్మదిన వేడుక... అభిమానులకు ప్రత్యేక మనవి!
నటసింహం నందమూరి బాలకష్ణ సూపర్ హిట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ లో విలన్ గా నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు దునియా విజయ్. కన్నడ చిత్ర రంగంలో అతడు క్రేజీ యాక్షన్ స్టార్. అతడు రీసెంట్ గా ‘భీమ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి.. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల పనులతో బిజీగా ఉన్నాడు. జనవరి 20 న విజయ్ తన 51వ పుట్టినరోజు వేడుకను జరుపుకోనున్నాడు. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్దమవుతున్నారు.
అయితే, ఈసారి విజయ్ తన పుట్టినరోజు గురించి ప్రత్యేకమైన పోస్ట్ ద్వారా అభిమానులకు సందేశం పంపించాడు. దునియా విజయ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ ... "నా ప్రియమైన అభిమానులారా... ప్రతీ సంవత్సరమూ మీరు నా పుట్టినరోజును మీ ఇంటి పండగలా జరుపుకుంటున్నారని నేను గమనిస్తున్నాను. ఈ సారి కూడా మీతో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకోవాలని నాకు కోరికగా ఉంది. కానీ ఈసారి అది సాధ్యం కావడం లేదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరి ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ప్రతీ పుట్టినరోజు రోజున నా తల్లిదండ్రుల సమాధి వద్ద మీతో కలవడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈసారి జడేష్ కె హంపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొనడం వల్ల నేను మా ఇంటిదగ్గర ఉండడం లేదు. మీ ప్రేమాభిమానానికి గౌరవం తెలుపుతూ ఆ రోజున నా కొత్త చిత్రం ఫస్ట్ లుక్ మీ అందరికోసం విడుదల చేస్తాం. మీకు మరో ముఖ్యమైన మనవి.. శనివారం, ఆదివారం రోజుల్లో నేను నా ఇంటి వద్ద ఉండను. కావున, దయచేసి ఎవరూ నా ఇంటి వద్దకు వచ్చి వేచి ఉండవద్దు. మీ అందరి అండకు ధన్యవాదాలు." అంటూ దునియా విజయ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.