బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.... నిజం ఏమిటి?

Update: 2025-01-16 03:55 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన నివాస స్థలంలో కత్తిపోట్ల కు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి ప్రయత్నించగా ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు. కానీ ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సైఫ్ అలీ ఖాన్ నివాసం బాంద్రాలోని అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉంది. అలాంటి ప్రాంతంలోకి ఎవరో తేలికగా చొరబడటం అసాధ్యమని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ దాడి సైఫ్ ఇంట్లో పని చేసే వ్యక్తులలో ఎవరైనా చేయి చేసుకున్నారా అన్న సందేహం ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది.

సైఫ్‌కు కలిగిన గాయాలు తీవ్రంగా ఉండటంతో అతడిని అత్యవసరంగా లీలావతి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దాడి చేసింది పరిచయస్తులే అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవల బాలీవుడ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన మరింత ఉద్రిక్తత కలిగించింది. బాలీవుడ్ టెన్షన్ వాతావరణంలో ఉన్నప్పుడే సైఫ్‌పై దాడి జరగడం అనేక ఊహాగానాలకు దారితీస్తోంది.

కరీనా కపూర్‌తో వివాహం జరిగిన సైఫ్ అలీ ఖాన్, పటౌడీ కుటుంబానికి వారసుడిగా ఉన్నారు. నటనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సైఫ్ అనేక చిత్రాల్లో మెప్పించారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు త్వరలో ప్రకటన చేయనున్నారు. అలాగే, పోలీసులు కూడా ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ సంఘటన బాలీవుడ్‌లో కలకలం రేపింది. దాడి వెనుక అసలు కారణం ఏంటో పోలీసుల దర్యాప్తు తర్వాత తెలియనుంది.

Tags:    

Similar News