వైవిధ్యభరిత నటనకు ప్రతీక అనంత్ నాగ్!
అనంత్ నాగ్ కెరీర్ ప్రారంభం నాటక రంగంతో ప్రారంభమైంది. సాంకేతికత, నటన పరంగా శ్యామ్ బెనెగల్ వంటి దర్శకులతో పనిచేయడం అతని అభినయాన్ని కొత్త స్థాయికి చేర్చింది.;
వైవిధ్యమైన పాత్రలతో 50 ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న నటుడు అనంత్ నాగ్. కన్నడ చిత్ర పరిశ్రమలో విశేషమైన పేరొందిన అనంత్ నాగ్, తన ప్రతిభను తెలుగు, హిందీ, మరాఠి, మలయాళం, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ ప్రదర్శించారు. 300కు పైగా చిత్రాలలో నటించిన ఈ ప్రతిభావంతుడు, కన్నడ చిత్రసీమను గర్వపడే స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
అనంత్ నాగ్ కెరీర్ ప్రారంభం నాటక రంగంతో ప్రారంభమైంది. సాంకేతికత, నటన పరంగా శ్యామ్ బెనెగల్ వంటి దర్శకులతో పనిచేయడం అతని అభినయాన్ని కొత్త స్థాయికి చేర్చింది. ‘అంకుర్, మంథన్, కొండుర, కల్‌యుగ్’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో అతని నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. అలాగే 'కేజీఎఫ్ 1'లో రచయిత ఆనంద్ పాత్రలో తనదైన ముద్రవేశారు.
తెలుగులో 'ప్రేమలేఖలు, అనుగ్రహం, శాంతి క్రాంతి, శంఖారావం, భీష్మ' వంటి చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా అనంత్ తన ప్రతిభను చూపించారు. ప్రసిద్ధ టీవీ సిరీస్ ‘మాల్గుడి డేస్’లో ఆయన నటన అద్భుతంగా నిలిచింది. తాజాగా కేంద్రప్రభుత్వం అనంత్ నాగ్ కు పద్మభూషణ్ ప్రకటించింది.