ఓటీటీలోకి ‘అలప్పుజ జింఖానా’ !
యువతలో సామాన్యంగా చదువు, ఉద్యోగం వంటి రొటీన్ జీవితాలే కనిపిస్తాయి. కానీ కొన్ని పరిస్థితులు వాళ్లను ఊహించని దారుల్లోకి తీసుకెళ్తాయి. అచ్చం అలాంటి కథే మలయాళ కామెడీ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ‘అలప్పుజ జింఖానా’. గతంలో ప్రేమలు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నస్లేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 13 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే అలప్పుజకు చెందిన జోజో జాన్సన్ & గ్యాంగ్ ఫెయిలైన విద్యార్థులు. డిగ్రీ అడ్మిషన్ దొరకని స్థితిలో, స్పోర్ట్స్ కోటా ద్వారా మార్గం వెతుక్కుంటారు. కానీ సమస్య ఏంటంటే వాళ్లు ఏ స్పోర్ట్ లోనూ ప్రావీణ్యం పొందలేదు! చివరకు బాక్సింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకొని, అలప్పుజలోని ‘జింఖానా అకాడమీ’లో చేరుతారు.
అక్కడ అంటోనీ జోషువా (లక్ష్మణ్ అవరన్) అనే ఆసక్తికర కోచ్ పరిచయమవుతాడు. అతని మార్గదర్శనంలో బాక్సింగ్‌లో అనుభవం లేని వీళ్ళు స్థానిక పోటీల నుంచి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ వరకు ఎలా ప్రయాణించారు? అన్నదే కథ.
బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా, సీరియస్ స్పోర్ట్స్ డ్రామా కంటే కామెడీ ప్రధాన కథనంతో సాగుతుంది. యువత, ఫ్రెండ్షిప్, ఫెయిల్యూర్స్, చిన్న విజయాల్లో ఉత్సాహం... ఇలా అన్ని అంశాలను సమతూకంగా మేళవించి రూపొందిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది.