సౌత్ లో విలన్ గా దూసుకుపోతున్న బాబీ డియోల్
స్టార్ హీరోల కెరీర్ గరిష్ఠ స్థాయికి చేరడం, ఆ తర్వాత వెనుకబడడం సర్వసాధారణం. అయితే కొందరు తమ ఫామ్ కోల్పోయినా.. తిరిగి పుంజుకుని ప్రేక్షకులను మెప్పించగలుగుతారు. అలా మళ్లీ ట్రాక్‌లోకి రావడం కొందరికి మాత్రమే సాధ్యం. ముఖ్యంగా, హీరోలుగా తమ సత్తా చూపించిన కొందరు.. ఆ తర్వాత ప్రతినాయకులుగా మారి కొత్త అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగులో జగపతి బాబు, బాలీవుడ్‌లో బాబీ డియోల్ ఈ కోవకు చెందిన వారు.
జగపతి బాబు హీరోగా తన కెరీర్‌ను మొదలుపెట్టి, మంచి విజయాలు సాధించినప్పటికీ, కాలానుగుణంగా అతని ఫామ్ తగ్గింది. కానీ, "లెజెండ్" సినిమాతో విలన్‌గా మారి, తనను మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో నిలుపుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుస విలన్ పాత్రలు చేస్తూ, జగపతి బాబు సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని ప్రతినాయకుడిగా మారిపోయారు.
ఇక బాలీవుడ్‌లో ఒకప్పుడు లీడ్ రోల్ హీరోగా రాణించిన బాబీ డియోల్ తన కెరీర్‌లో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అయితే "యానిమల్" సినిమాలో ప్రతినాయకుడి పాత్రతో అతని ఫామ్ తిరిగి వచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజయంతో బాబీ డియోల్ క్రేజీ ప్రాజెక్టులు అందుకుంటున్నాడు. తెలుగులో "డాకు మహారాజ్" చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోకు సరైన ప్రతినాయకుడిగా నిలిచాడు. సినిమాలో బాబీ డియోల్ ప్రదర్శించిన విలనిజం, నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బాలీవుడ్‌లో తిరిగి తన సత్తా చాటుకున్న బాబీ డియోల్, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు.
తన రెండో ఇన్నింగ్స్‌లో బాబీ డియోల్ వరుస అవకాశా లతో దూసుకెళ్తున్నాడు. ఆయనకు వస్తున్న సౌత్ ప్రాజెక్టులు అతని కెరీర్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి. పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ, నటనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. "డాకు మహారాజ్" వంటి సినిమాలు అతని ప్రతిభను ప్రదర్శించడానికి ఓ మంచి వేదికగా నిలిచాయి. త్వరలో రాబోయే .. పవర్ స్టార్ .. ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో అలరించబోతున్నాడు. అది కూడా విలన్ పాత్ర కావడం విశేషం. మరి బాబీ విలన్ గా ఇంకెన్ని చిత్రాల్లో నటిస్తాడో చూడాలి.