'వార్ 2' రివ్యూ

బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి వచ్చిన చిత్రం ‘వార్ 2‘. సూపర్ హిట్ ‘వార్‘కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి సౌత్, నార్త్ స్టార్స్ కలిసి నటించారు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రేజీ మల్టీస్టారర్ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.;

By :  S D R
Update: 2025-08-14 07:34 GMT

నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, అసుతోష్ రానా, అనిల్ కపూర్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్

సంగీతం: ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార

ఎడిటింగ్ : ఆరిఫ్ షేక్

నిర్మాత: ఆదిత్య చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీ

విడుదల తేది: ఆగస్టు 14, 2025

బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి వచ్చిన చిత్రం ‘వార్ 2‘. సూపర్ హిట్ ‘వార్‘కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి సౌత్, నార్త్ స్టార్స్ కలిసి నటించారు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రేజీ మల్టీస్టారర్ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

రా మాజీ ఏజెంట్ కబీర్‌ (హృతిక్ రోషన్) దేశం దృష్టిలో ద్రోహిగా మారి అజ్ఞాతంలో ఉంటాడు. డెడ్లీ టెర్రరిస్ట్ కార్టెల్‌ లీడర్‌ కలిని అంతమొందించేందుకు రా చీఫ్‌ కల్నల్‌ లూథ్రా (అశుతోష్ రాణా) కబీర్ ను ఆ గ్రూపులోకి స్పైగా పంపిస్తాడు. అక్కడ మొదటి టాస్క్‌గా కబీర్‌కి తన గురువు, రా చీఫ్ సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)ని హతమార్చమని ఆదేశిస్తారు.. అతడు అదే చేస్తాడు. దీంతో కొత్త రా చీఫ్ విక్రాంత్ కౌల్‌ (అనిల్ కపూర్) నేతృత్వంలో, సోల్జర్ విక్రం చలపతి (ఎన్టీఆర్‌) నాయకత్వంలో కబీర్ కోసం వేట మొదలవుతుంది. లూథ్రా కూతురు కావ్య (కియారా అద్వాణీ) కూడా ఈ బృందంలో ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతడికి-కావ్యకి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? కాలి కార్టెల్ వెనకున్న శక్తులు ఎవరు వంటి రహస్యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

‘వార్ 2‘ యాక్షన్ పరంగా YRF స్పై యూనివర్స్ అభిమానులకు క్రేజీ ట్రీట్. ఆరంభం నుంచే హై టెక్నికల్ వేల్యూస్‌తో యాక్షన్ సీక్వెన్స్‌లు అదరగొడతాయి. ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్ తన ఇంటెన్స్ నటన, యాటిట్యూడ్‌తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. హృతిక్ రోషన్ తన మార్క్ ప్రెజెన్స్, యాక్షన్‌తో ఇంప్రెస్ చేశాడు. ఇద్దరి మధ్య ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, బ్రోమాన్స్ బాగా నచ్చుతాయి.

ఈ సినిమా హీరో-విలన్ కథ కాకుండా ఇద్దరు హీరోల కథగా మొదలవుతుంది. జపాన్‌లో హృతిక్ ఫైట్‌, నౌకలో ఎన్టీఆర్ యాక్షన్‌ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌కి హైలైట్‌. కబీర్‌పై విక్రమ్ వేట ప్రారంభం నుంచి అసలైన వార్ మొదలవుతుంది. స్పెయిన్‌లో ఛేజింగ్‌, ఇంటర్వెల్ కి ముందు ఆకాశంలో యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సెకండ్ హాఫ్‌లో యాక్షన్‌తో పాటు భావోద్వేగాన్నీ చూపించే ప్రయత్నం చేశారు. కబీర్–రఘు స్నేహం, కబీర్–కావ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. దేశభక్తి, త్యాగాల సందేశం ఉన్నప్పటికీ, లోతైన భావోద్వేగాల కొరత కొంత మైనస్‌. కేంద్ర మంత్రి సారంగ్ ట్రాక్ కొంత గందరగోళంగా అనిపిస్తుంది.

విక్రమ్–కార్టెల్ సన్నివేశాలు, దావోస్‌లో క్లైమాక్స్ యాక్షన్‌, భావోద్వేగాలు బలంగా నిలుస్తాయి. చివర్లో ‘ఆల్ఫా’ అనే కొత్త పాత్ర పరిచయం భవిష్యత్తులో యూనివర్స్‌కి మలుపు ఇస్తుందనే ఆసక్తి పెంచుతుంది. మొత్తంమీద భావోద్వేగాలు తక్కువైనా, ఇద్దరు హీరోల యాక్షన్‌ హంగామా పైసా వసూల్‌.

మరోవైపు ఈ సినిమాలో భావోద్వేగాలు, దేశభక్తి అంశాలు కొంత లోపించాయని చెప్పొచ్చు. ఇద్దరు హీరోల ఘర్షణ బాగానే ఉన్నా, దానికి దారితీసే పరిస్థితులు బలంగా లేవు. మెయిన్ విలన్ బలహీనంగా అనిపించగా, కనిపించని ప్రతినాయకుడితో పోరాటం ఆసక్తి తగ్గించింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నత్తనడకన సాగడం మైనస్.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

‘వార్‌ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జోడీ ఆకట్టుకుంది. కబీర్‌గా హృతిక్ మునుపటిలాగే సమర్థంగా నటించగా, విక్రమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఈ ఇద్దరి యాక్షన్ సన్నివేశాలు, ‘సలామ్ అనాలి‘ పాటలో వారి డ్యాన్స్ మంత్రముగ్ధం చేస్తాయి. కియారా లిమిటెడ్ రోల్‌లో బాగా చేసింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ నటన మెప్పించగా, కథ ప్రధానంగా హృతిక్–ఎన్టీఆర్‌ల చుట్టూ తిరగడంతో ఇతర పాత్రలకు తక్కువ ప్రాధాన్యం లభించింది.

సాంకేతికంగా బెంజ‌మిన్ జాస్పర్ కెమెరా పనితనం, ప్రీతమ్ బాణీలు ఆకట్టుకున్నాయి. సంచిత్–అంకిత్ నేపథ్య సంగీతం సినిమాకి బలం చేకూర్చింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్‌లో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ చేసిన తీరు ప్రశంసనీయం. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

చివరగా

‘వార్ 2‘.. తారక్-హృతిక్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్!


Telugu70MM Rating: 2.75 / 5

Tags:    

Similar News