‘వార్ 2‘ మూవీ హైలైట్స్
బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మాస్ పవర్ ఒకే ఫ్రేమ్‌లో కలిస్తే అదే ‘వార్ 2‘. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్‌కి తోడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ‘వార్ 2‘పై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంది.;
బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మాస్ పవర్ ఒకే ఫ్రేమ్‌లో కలిస్తే అదే ‘వార్ 2‘. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్‌కి తోడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ‘వార్ 2‘పై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్‌కి చెందిన స్పై యూనివర్స్‌లో ఇది అతి పెద్ద చాప్టర్‌గా నిలుస్తోందనే అంచనాలున్నాయి.
ఈ సినిమాలో హృతిక్ మేజర్ కబీర్ ధలివాల్ గా, ఎన్టీఆర్ స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే కబీర్ ఒకప్పుడు భారత గూఢచార ఏజెంట్‌గా ఉండి, రోగ్‌గా మారి దేశంలోనే అతిపెద్ద విలన్‌గా అవతరిస్తాడు. అతన్ని ఎదుర్కొనేందుకు విక్రమ్‌ను భారత ప్రభుత్వం పంపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, ట్రైలర్‌లోనే అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయి.
15 నిమిషాల సాగే ఒక హ్యాండ్-టు-హ్యాండ్ ఫైట్ సీన్, ఫైటర్ జెట్‌లలో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. సినిమా ఆద్యంతం హృతిక్-తారక్ నువ్వా నేనా అంటూ పోటీ పడి నటించారట. మొత్తంగా అయన్ ముఖర్జీ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, అభిమానుల అంచనాలను మించి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుందని ప్రచార చిత్రాలతో అర్థమైంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. ఇది తారక్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక పాత్ర ‘జై లవకుశ’లోని ‘జై’ని మించే నెగటివ్ షేడ్స్‌తో కూడినది కాగా, మరొకటి దేశభక్తితో నిండిన శక్తివంతమైన పాత్రగా ఉంటుందని టాక్. ఈ డ్యూయల్ రోల్‌తో ఎన్టీఆర్ తన నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకోనున్నాడు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ సిక్స్-ప్యాక్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు అభిమానులను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లాయి.
‘వార్ 2’ భారత సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా చెప్పొచ్చు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్ వంటి అంతర్జాతీయ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ సాగింది. స్పెయిన్ లోని సలమాంకాలో కార్ చేజ్ సీక్వెన్స్, అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్‌లో బోట్ చేజ్, ముంబైలో షావోలిన్ మొనాస్టరీ సెట్‌లో ఫైట్ సీన్‌లు అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తాయట. ఇండియాలో తొలిసారిగా డాల్బీ సినిమా ఫార్మాట్‌లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో పాటు కియారా అద్వానీ మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇంకా కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా నటించాడు. అతిథి పాత్రల్లో అలియా భట్, బాబీ డియోల్ మెరవనున్నారట. ఈ సినిమాలో హృతిక్, కియారా మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఒకటి అయితే.. దానికి ఎన్నో రెట్లు మించినదిగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే డ్యాన్స్ నంబర్ ను నిలవనుందని తెలుస్తోంది.
ఇండియాలోని ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ చేసిన ‘సలామ్ అనాలి‘ పాట విజువల్ గా థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. 500 మంది డాన్సర్లతో బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో ఈ పాట రూపొందింది. మొత్తంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల స్టార్ పవర్, అయాన్ ముఖర్జీ విజన్, యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ‘వార్ 2‘ థియేటర్లలోకి వచ్చేస్తోంది. మరి.. తొలిరోజు ‘వార్ 2‘ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.