'తమ్ముడు' మూవీ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో నితిన్ నటించిన చిత్రం ‘తమ్ముడు‘. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.;

By :  S D R
Update: 2025-07-04 08:41 GMT

నటీనటులు: నితిన్‌, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌

ఎడిటింగ్ : ప్రవీణ్‌ పూడి

నిర్మాతలు: దిల్‌ రాజు, శిరీష్‌

దర్శకత్వం: శ్రీరామ్‌ వేణు

విడుదల తేది: జూలై 04, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో నితిన్ నటించిన చిత్రం ‘తమ్ముడు‘. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సీనియర్ నటి లయ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘కాంతార‘ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఇలా ఎన్నో అంచనాలతో ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘తమ్ముడు‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

జై (నితిన్‌) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చే లక్ష్యంతో ఉంటాడు. అయితే చిన్నప్పుడు తన తప్పు వల్ల అక్క ఝాన్సీ (లయ) దూరమవడం వల్ల అతను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. అక్కని మళ్లీ కలవాలనే తపనతో తన స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ)తో కలిసి వైజాగ్‌కు వెళ్తాడు. అక్కడ ఝాన్సీ తన కుటుంబంతో అంబరగొడుగు జాతరకు వెళ్లినట్టు తెలుసుకుని, జై అక్కడికి చేరుకుంటాడు.

ఆ సమయంలో ఝాన్సీని చంపేందుకు బిజినెస్‌మెన్ అజార్వాల్ (సౌరభ్‌ సచదేవ) టీమ్ ప్రయత్నిస్తుంది. అసలు ఎందుకు అజర్వాల్ ఆమెను టార్గెట్ చేశాడు? అజార్వాల్ చేతుల నుంచి అక్కను రక్షించడంలో జై కి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలా సహాయం చేసింది? చివరకు జై తన చిన్ననాటి తప్పును సరిదిద్దుకున్నాడా? అక్క ప్రేమను తిరిగి పొందాడా? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్రం. ఒక క్రూర విలన్ ఆడే నాటకంలో ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇరుక్కోడం, ఆమె ఆశయం నెరవేర్చేందుకు తమ్ముడు చేసే పోరాటం ఈ సినిమా స్టోరీ లైన్.

దర్శకుడు శ్రీరామ్ వేణు గత సినిమాల తరహాలోనే కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేస్తూ ఈ చిత్రం సాగుతుంది. అయితే, స్క్రీన్‌ప్లే పరంగా అంచనాలను చేరుకోలేకపోయాడు. స్టోరీ థీమ్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ, తెరపై ప్రెజెంటేషన్‌ మాత్రం రెగ్యులర్‌గా అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లో నితిన్‌ అక్క కోసం వెతకడం వంటి అంశాలు అంతగా ఎమోషనల్ గా లేవు. అయితే.. ఇంటర్వెల్‌ బ్యాంగ్ కొంత ఆసక్తి కలిగిస్తుంది. సెకండాఫ్‌లో అంబరగొడుగు నేపథ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్‌ సీక్వెన్స్‌లు బాగా ప్రెజెంట్ చేశారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జై పాత్రలో తనదైన మార్క్ చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. లయ నటించిన ఝాన్సీ పాత్ర హృద్యంగా నిలిచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, సహజమైన నటనతో ఆ పాత్రలో ఒదిగిపోయింది.

రత్నం పాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ – ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లేడీ విలన్‌గా స్వసిక బలమైన పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు సౌరబ్ సచదేవ విలనిజాన్ని తగిన స్థాయిలో చూపించాడే కానీ, అతని పాత్ర ముగింపు మాత్రం బలహీనంగా అనిపించింది. హరితేజ సహా మిగిలిన నటీనటులందరూ తాము చేసిన పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు శ్రీరామ్‌ వేణు కథ ఆసక్తికరంగా రాసుకున్నప్పటికీ, దాన్ని తెరపై ఆసక్తికరంగా ప్రెజెంట్‌ చేయలేకపోయాడు. ‘కాంతార’ ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో వర్కౌట్ అయినా, మొత్తంమీద అంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కెమెరామెన్‌ కేవీ గుహన్‌ విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

చివరగా

అక్క మాట కోసం ‘తమ్ముడు‘ పోరాటం

Tags:    

Similar News