రాజమౌళి vs అమీర్ ఖాన్
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు 'బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్' వంటి బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మరోవైపు 'లగాన్, దంగల్' వంటి చిత్రాలతో భారతీయ సినిమా గౌరవాన్ని పెంచిన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.;
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు 'బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్' వంటి బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మరోవైపు 'లగాన్, దంగల్' వంటి చిత్రాలతో భారతీయ సినిమా గౌరవాన్ని పెంచిన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. ఈ ఇద్దరూ భారతీయ సాహిత్యంలోని అత్యంత గొప్ప ఇతిహాసం 'మహాభారతం'ను తెరపైకి తీసుకొచ్చేందుకు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు.
రాజమౌళి చాలాకాలంగా 'మహాభారతం' తన కలల ప్రాజెక్ట్ అని చెబుతూ వస్తున్నాడు. 'బాహుబలి' లాంటి చిత్రాలతో భారీ సెట్స్, ఆకట్టుకునే విజువల్స్, భావోద్వేగ నటనలను అద్భుతంగా మేళవించగలిగిన రాజమౌళి, 'మహాభారతం'ను ఐదు భాగాల సినిమా ఫ్రాంచైజీగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రం తన కెరీర్‌లో చివరి ప్రాజెక్ట్ అవుతుందని, దీని కోసం 10-15 సంవత్సరాలు కేటాయించాలని ఆయన పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు.
మరోవైపు అమీర్ ఖాన్ 'మహాభారతం'ను తెరపైకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాదే 'మహాభారతం' ప్రాజెక్ట్ రచనా పనులు ప్రారంభమై, షూటింగ్ కూడా మొదలవుతుందని ఆయన ప్రకటించాడు. ఈ చిత్రాన్ని పలు భాగాలుగా, ఒకేసారి షూట్ చేసి 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో విడుదల చేయాలని అమీర్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి భాగానికి వేర్వేరు దర్శకులు, భారతదేశంలోని వివిధ భాషల నటులతో ఈ చిత్రం రూపొందనుంది. అమీర్ ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాతగా వ్యవహరిస్తూ, కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించాలని ఆసక్తి చూపిస్తున్నాడు.
మరి.. 'మహాభారతం' రేసులో అమీర్ ఖాన్ ముందంజలో ఉన్నప్పటికీ, రాజమౌళి గత చిత్రాల ద్వారా సంపాదించిన విజువల్ స్టోరీటెల్లింగ్ నైపుణ్యం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 'మహాభారతం' లాంటి ఇతిహాసాన్ని రాజమౌళి హ్యాండిల్ చేస్తే, అందులోని భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలు ప్రపంచ స్థాయిలో ఆకట్టుకుంటాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే, అమీర్ ఖాన్‌కు 'పర్ఫెక్షనిస్ట్' ట్యాగ్ ఉండటం, ఆయన సినిమాల్లో కథను జాగ్రత్తగా నడిపించే తీరు ఈ ప్రాజెక్ట్‌కు బలం.
'మహాభారతం' సినిమాగా రూపొందించడం అంత సులభం కాదు. ఈ ఇతిహాసం భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కాబట్టి కథను సమర్థవంతంగా చెప్పడంతో పాటు, సాంస్కృతిక సున్నితత్వాలను గౌరవించాల్సి ఉంటుంది.