'ఓజీ' రికార్డుల వేట
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినా, చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక శైలి, మాస్ అప్పీల్, అప్రతిహతమైన స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినా, చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక శైలి, మాస్ అప్పీల్, అప్రతిహతమైన స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఖుషి’తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన పవన్, ‘గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను ఊపేశాడు. ఎన్ని ఫ్లాపులు ఎదురైనా చెక్కుచెదరని క్రేజ్ ఆయనకే ప్రత్యేకం.
అయితే రాజకీయాల్లో బిజీ అయి, సినిమాలపై దృష్టి తగ్గడంతో ఆయన స్టార్ పవర్‌కి తగ్గ స్థాయి సినిమాలు రాలేదు. దాంతో కలెక్షన్ల రికార్డుల పరంగా కొంత వెనుకబడ్డాడు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ మొత్తాన్ని పూడ్చేసేలా వస్తోంది ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, పవన్ స్టైల్‌కి సరిగ్గా సరిపోయే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది. రెండేళ్ల కిందట విడుదలైన చిన్న గ్లింప్స్ తోనే అద్భుతమైన హైప్ సృష్టించిన ఈ సినిమా, రిలీజ్ సమయానికి ఆ హైప్‌ను మరింత రెట్టింపు చేసుకుంది.
సరిగ్గా ప్రమోషన్లు చేయకపోయినా ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు ఆగట్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారానే 2 మిలియన్ డాలర్లను దాటేసింది. తెలంగాణ, ఆంధ్రలో షోలు ఆలస్యంగా ఓపెన్ అయినా అన్ని టికెట్లు క్షణాల్లో సోల్డ్ ఔట్ అవుతున్నాయి.
రిలీజ్‌కు ఒక రోజు ముందే ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లను దాటేసింది. దీన్ని బట్టే హైప్ స్థాయి అర్థమవుతుంది. మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం కనిపిస్తోంది. పైగా ఈరోజు నుంచే పెయిడ్ ప్రీమియర్లు మొదలవుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండే అవకాశం ఉంది.