నయనతార డాక్యుమెంటరీకి మళ్లీ షాక్!
లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ విడుదలైనప్పటి నుంచే వివాదాలు వెంటాడుతున్నాయి.;
లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ విడుదలైనప్పటి నుంచే వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా ఫుటేజీ విషయంలో నటుడు ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారంతో కోర్టును ఆశ్రయించగా, తాజాగా మరో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది.
సూపర్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి సంబంధించిన ఫుటేజీని అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ, ఆ సినిమా హక్కులు కలిగిన ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరియు డాక్యుమెంటరీ నిర్మాతలు టార్క్ స్టూడియోలపై రూ. 5 కోట్ల నష్టపరిహారం కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ ఫుటేజీని యూట్యూబ్ నుంచి సేకరించి చట్టవిరుద్ధంగా ఉపయోగించారని, ఈ విషయంపై తాము మొదట లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ తెలిపింది.
ఇప్పటికే ధనుష్ దావా విచారణలో ఉండగా, తాజాగా 'చంద్రముఖి' వివాదంతో ఈ డాక్యుమెంటరీపై విమర్శలు మళ్లీ ఊపందుకున్నాయి. నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితం, విఘ్నేశ్ శివన్‌తో ఆమె వివాహ వేడుకల గురించి చర్చించిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పద అంశాలతో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.