'జాక్' రివ్యూ

పక్కింటబ్బాయి తరహా పాత్రలతో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఈసారి 'జాక్' అనే స్పై యాక్షన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.;

By :  S D R
Update: 2025-04-10 08:07 GMT

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు

సినిమాటోగ్రఫీ: విజయ్ కె చక్రవర్తి

సంగీతం: అచ్చు రాజమణి

ఎడిటింగ్‌: నవీన్ నూలి

నిర్మాత: BVSN ప్రసాద్

దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్

విడుదల తేది: 10-04-2025

పక్కింటబ్బాయి తరహా పాత్రలతో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఈసారి 'జాక్' అనే స్పై యాక్షన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి.. 'జాక్' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

చిన్నప్పటి నుంచే ఏదో కొత్తగా చేయాలనే తాపత్రయం ఉన్న యువకుడు పాబ్లో నెరోడా (సిద్ధు జొన్నలగడ్డ), కానీ అంద‌రికీ తెలిసిన పేరు జాక్‌. క్రికెట్, ఫుట్‌బాల్‌, టెన్నిస్ – ఏదైనా ఆట అంటే ప్రేమ. కానీ, కోచ్‌లు చెప్పినట్టు ఆడాలంటే జాక్‌ ఒప్పుకోడు.

దీంతో జాక్ దృష్టి దేశ సేవపై పడుతుంది. రా ఏజెంట్ కావాలనుకుంటాడు. పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలు ఫేస్ చేసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న జాక్ ఖాళీగా కూర్చోవడానికి ఒప్పుకోడు. దేశాన్ని రక్షించడమే లక్ష్యంగా తనదైన శైలిలో అన్‌آఫిషియల్ మిషన్స్ మొదలుపెడతాడు.

ఆసమయంలో దేశం ఓ తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకుంటుంది. హైద‌రాబాద్‌తో సహా నాలుగు ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఓ భారీ విధ్వంసకాండకు రెడీ అవుతారు. ఆ మిషన్‌ను ఛేదించేందుకు రా(RAW) రంగంలోకి దిగుతుంది. ఆ మిషన్‌కి నాయకుడు మనోజ్ (ప్రకాశ్ రాజ్).

అయితే అఫీషియల్ గా 'రా' లో లేనప్పటికీ, అదే మిషన్‌ని తన శైలిలో ఛేదించేందుకు జాక్ ముందడుగు వేస్తాడు. మరి.. జాక్ ఈ మిషన్‌లో విజయవంతమయ్యాడా? అతడికి 'రా'లో స్థానం దక్కిందా? మరోవైపు భానుమతి అలియాస్ అఫ్సాన్ (వైష్ణవి చైతన్య) క్యారెక్టర్ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

తల్లిని ఉగ్రవాద చర్యల వల్ల కోల్పోయిన ఓ యువకుడు.. బాల్యంలో ఎదురైన ఆత్మగౌరవ సంఘటనలు అతడిని ఆక్రోశంతో ఎదిగేలా చేశాయి. జీవితంలో రా ఏజెంట్ అవ్వాలనే లక్ష్యంతో జీవించే అతడు, ఊహల్లోనే మిషన్ మొదలుపెట్టి, ఎలా రియల్ మిషన్‌లోకి జారిపడతాడన్నదే కథ.

‘రా’ వంటి ప్రతిష్టాత్మక సంస్థను కథలో ఉపయోగించిన విధానం కొద్దిపాటి చర్చకు లోనవ్వవచ్చు. అయితే, ప్రారంభంలో రా గురించి చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌ ద్వారా దర్శకుడు కథలో బలమైన ఎమోషన్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు.

సినిమా ఉగ్రవాదంపై యుద్ధం నేపథ్యంలో సాగుతుందని అనిపించినా, మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్స్ ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తాయి. సిద్దు జొన్నలగడ్డ తన మాస్, కామిక్ టైమింగ్‌ రెండింటినీ మిక్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్ లా అనిపించొచ్చు కానీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది.

క్లైమాక్స్ యాక్షన్ సీన్లు ఎక్కువ హైప్ ఇవ్వకపోయినా, కథకి సరిపడే స్థాయిలో మలిచాడు భాస్కర్. నేపాల్ లొకేషన్లు విజువల్‌గా బాగున్నా, కథన పరంగా మరింత బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన 'రాయి శిల్పమవుతుంది' అనే కాన్సెప్ట్ కథలో నిగూఢంగా ఉండటం మంచి ప్రయత్నం. మొత్తానికి 'జాక్' ఒక కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ప్యాకేజ్.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన సిద్ధు జొన్నలగడ్డ ఎంతో ఈజ్ తో 'జాక్' క్యారెక్టర్ లో అలరించాడు. అయితే కొన్ని చోట్ల 'జాక్' క్యారెక్టర్లో 'టిల్లు' ఛాయలు కనిపిస్తాయి. ఇది ఆయన ఫ్యాన్స్‌కు సరదా అనిపించినా, కొత్తదనం కోరుకున్నవారికి మాత్రం నిరాశగా మారవచ్చు.

హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి స్క్రీన్ టైమ్ దక్కినా, ఆమె పాత్ర భావోద్వేగాల కంటే గ్లామర్‌ను ఆధారంగా వేసుకుని రాసినట్లు అనిపిస్తోంది. కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో ఆకట్టుకున్నా, ఆమె నటనకు పెద్దగా సవాళ్లు కనిపించలేదు.

ప్రకాష్ రాజ్ తన స్థాయికి తగ్గట్లు మరోసారి పవర్‌ఫుల్ రోల్ లో ఆకట్టుకున్నాడు. సుబ్బరాజు, నరేష్, రవి ప్రకాష్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రాసిన కథలో కొత్తదనం తక్కువనే చెప్పాలి. అయితే కథనం ద్వారా ఆసక్తిని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సిద్దు మార్క్ హ్యూమర్ కొన్ని చోట్ల పనిచేసింది. సంగీతం విషయానికొస్తే పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదని చెప్పొచ్చు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా

'జాక్'.. కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ప్యాకేజ్

Tags:    

Similar News